పోలింగ్‌కు అంతా రెడీ: భన్వర్‌లాల్‌

21 Aug, 2017 18:20 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.  ఓటర్లను ప్రలోభ పెట్టినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
 
మొత్తం 255 పొలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. 6 కంపెనీ  పారా మిలటరీ బలగాలతో భద్రతా ఏర్పాటు చేశామని, 82 ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ లు క్షేత్రస్థాయిలో ఎన్నికలను పరిశీలిస్తాయని ఆయన అన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో ఉన్నవారంతా ఓటేయొచ్చని తెలిపారు. 23వ తేదీ వరకు మద్యం షాపులు బంద్‌ చేయాలని, బల్క్‌ ఎస్సెమ్మెస్‌లపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఎలాంటి ఒపీనియన్‌ పోల్స్‌, సర్వేలు నిర్వహించకూడదన్న ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామన్నారు. సోషల్‌ మీడియాలో కూడా ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. ఓటర్లందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించేలా ఏర్పాట్లు చేశామని భన్వర్‌లాల్‌ వెల్లడించారు.
 
ఓటర్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా 9223 166166 నంబర్‌ కు ఎస్‌ఎమ్మెస్‌ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి సూచించారు.
మరిన్ని వార్తలు