ఆసక్తికరంగా మారిన ఆర్థిక సర్వే.. ఏం చెప్తారో?

31 Jan, 2017 09:50 IST|Sakshi
ఆసక్తికరంగా మారిన ఆర్థిక సర్వే.. ఏం చెప్తారో?
బడ్జెట్ గడియలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్కరోజు ముందు అంటే నేటి మధ్యాహ్నం (మంగళవారం) ఆర్థిక సర్వే పార్లమెంట్ ముందుకు వస్తోంది. గడిచిన 12 నెలల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిని ఈ సర్వేలో సమీక్షించనున్నారు. పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు చూపించిన ప్రదర్శనను కూడా ఈ సర్వేలో వివరించనున్నారు. అంతేకాక భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వయిజరీ అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆయన టీమ్ సభ్యులు కలిసి రూపొందించారు. 
 
నేడు ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక సర్వేలో కొన్ని ముఖ్యాంశాలు 
 
జీడీపీ అంచనాలు : పెద్ద నోట్ల రద్దు అనంతరం 2017-18 గణాంకాలు, ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ఎంతో కీలకంగా మారాయి. ఐఎంఎఫ్ ఇప్పటికే 2016-17 భారత వృద్ధి రేటును 6.6 శాతానికి కోత పెట్టింది. ఈ సంస్థ ముందస్తు అంచనాలు 7.6 శాతంగా ఉండేవి.  కరెన్సీ బ్యాన్ వినియోగాన్ని తాత్కాలికంగా షాకింగ్లోకి నెట్టేసిందని  ఐఎంఎఫ్ వెల్లడించింది. అదేవిధంగా 2017-18 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 7.2 శాతానికి కుదించేసింది. దీంతో జీడీపీ అంచనాలపై ఆర్థిక సర్వేలో చేయబోయే వ్యాఖ్యనాలపై ఎక్కువగా ఫోకస్ నెలకొంది. 
 
పెద్ద నోట్ల రద్దు : డీమానిటైజేషన్పై సుబ్రహ్మణ్యం, ఆయన టీమ్ సభ్యులు ఏం చెప్తారోనని విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ అంటే రూ.15.44 లక్షల కోట్ల కరెన్సీ ప్రభుత్వ తీసుకున్న రద్దు నిర్ణయంతో నిరూపయోగంగా మారిన సంగతి తెలిసిందే. వినియోగ వ్యయంపై ఇది భారీగా ప్రభావం చూపింది. వినియోగవ్యయం జీడీపీలో కనీసం 60 శాతం ఆదాయాన్ని అందిస్తోంది. ఒక్కసారిగా వినియోగ వ్యయం పడిపోవడంతో జీడీపీ వృద్ధి అంచనాలు పడిపోతున్నాయి.
 
యూనివర్సల్ బేసిక్ ఇన్ కమ్ :  సామాజిక భద్రత పేరిట ఈసారి ఆర్థిక సర్వేలో ప్రత్యేక ఫీచర్గా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఉంటుందని సుబ్రహ్మణ్యం ముందస్తుగానే తన రిపోర్టులో పేర్కొన్నారు. పేదరికం ఆధారంగా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20 కోట్ల మంది తేలినట్టు సమాచారం. 
 
అంతర్జాతీయ అంశాలు : మన ఆర్థికవ్యవస్థపైనే కాక, గ్లోబల్ ఎకానమీపై కూడా చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్  పలు వ్యాఖ్యలు చేయనున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం,  రక్షణాత్మక ఆర్థిక విధానాలపై ప్రపంచంలో చాలా దేశాలు దృష్టిసారించడం వంటి వాటిని సుబ్రహ్మణ్యం ప్రస్తావించనున్నారు.
 
బ్లాక్ మనీ : గత ఏడాది ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో సుబ్రహ్మణ్యం అధిక పన్ను వేయాల్సినవసరం ఉందని నొక్కి చెప్పారు. భారత జీడీపీకి మొత్తంగా పన్నుల ద్వారా వచ్చే కేవలం 5.4 శాతమేనని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పన్నులపై ఎలాంటి ప్రకటన చేయనున్నారోనని ఆసక్తి నెలకొంది. బ్లాక్మనీని రూపుమాపడానికి ప్రభుత్వం ఎలా వ్యవహరించనుందో ఆయన ఈ సర్వేలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.    
 
మరిన్ని వార్తలు