ద్వితీయార్థంలో ఎకానమీ రికవరీ

6 Oct, 2013 02:08 IST|Sakshi
ద్వితీయార్థంలో ఎకానమీ రికవరీ

సాక్షి, బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎకానమీ ఒత్తిళ్ల నుంచి మళ్లీ కోలుకోగలదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కరెంటు ఖాతా లోటును (క్యాడ్) 70 బిలియన్ డాలర్ల లోపే కట్టడి చేసి.. ఆర్థికవేత్తలు, విశ్లేషకుల అంచనాలను తప్పని నిరూపిస్తామని స్పష్టం చేశారు.   స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు అయిన ఒక కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 101 శాఖలను ఏకకాలంలో ప్రారంభించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.
 
 మన పేదలు నిజాయితీపరులు ..
 భారత్‌లో సంపన్నులతో పోలిస్తే పేదలు విశ్వసనీయమైన వారని, నిజాయితీగా రుణాలు తిరిగి చెల్లించేవారని ఆయన కితాబిచ్చారు. ఆధార్ కార్డులు తప్పనిసరి కాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. తాము వీటి ప్రయోజనాన్ని అత్యున్నత న్యాయస్థానానికి నివేదిస్తున్నామని చిదంబరం వివరించారు. ఎన్‌ఎస్‌ఈఎల్ చెల్లింపుల కుంభకోణంలో ఎంసీఎక్స్, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌లతో పాటు ప్రమోటర్ ఎఫ్‌టీఐఎల్‌పై కూడా నియంత్రణ సంస్థలు సెబీ, ఎఫ్‌ఎంసీ నిఘా ఉంచాయని చెప్పారు. కొత్తగా రాబోయే ప్రైవేట్ బ్యాంకులు ఇప్పుడున్న బ్యాంకులకు నకళ్లుగా ఉండరాదని, పేదలకు సైతం సేవలు విస్తరించగలగాలని సూచించారు.

మరిన్ని వార్తలు