ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ ఉత్తర్వులు

29 Jun, 2016 22:10 IST|Sakshi
ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ ఉత్తర్వులు

  -  జగన్ సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారం...
  - సీబీఐ ఛార్జిషీట్లనే తానూ తీసుకున్న ఈడీ
 - వాటిలో పేర్కొన్న ఆస్తుల వరస అటాచ్‌మెంట్లు
 - ఇప్పటిదాకా7 ఛార్జిషీట్లు; ఇది ఎనిమిదవది
 - ఈ ఛార్జిషీట్లో మాత్రం సీబీఐ పేర్కొనని ఆస్తులూ అటాచ్!!
 - కేసులో సీబీఐ వేసినవి మొత్తం 11 ఛార్జిషీట్లు
 - 2012 అక్టోబర్లో అటాచ్‌మెంట్ మొదలెట్టిన ఈడీ


సాక్షి, హైదరాబాద్: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి పలు ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. వి.వి.లక్ష్మీనారాయణ జాయింట్ డెరైక్టరుగా ఉన్న సమయంలో సీబీఐ ఈ వ్యవహారానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయటం తెలిసిందే. ఎన్నడూ లేనట్టుగా విచిత్రమైన రీతిలో ఈ కేసుకు సంబంధించి దఫదఫాలుగా మొత్తం 11 ఛార్జిషీట్లను సీబీఐ దాఖలు చేసింది. తొలి ఛార్జిషీటును 2012 మార్చి 31న దాఖలు చేసిన సీబీఐ... 11వ ఛార్జిషీటును 2013 సెప్టెంబరు చివర్లో దాఖలు చేయటం గమనార్హం. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ సహా పలు అంశాలు ఇమిడి ఉన్నట్లు సీబీఐ పేర్కొనటంతో... ఆ కోణాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది.

 ఈడీ నిజానికి సొంతగా ఎలాంటి దర్యాప్తూ చేయటం లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లను యథాతథంగా తీసుకుంటూ... అందులో పేర్కొన్న ఆస్తుల్ని వరసగా అటాచ్ చేస్తూ వస్తోంది. ఇప్పటిదాకా 7 ఛార్జిషీట్లకు సంబంధించి అందులో పేర్కొన్న ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ‘‘ఈ ఒక్క ఛార్జిషీట్ విషయంలో మాత్రం సీబీఐ పేర్కొనని ఆస్తులను కూడా అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. దీనిపైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కడప జిల్లాలో రఘురామ్ సిమెంట్‌కు సున్నపురాయి మైనింగ్ లీజును ఇవ్వటం వల్ల ఆ సంస్థ భారీగా లాభపడిందని, ప్రభుత్వానికి నష్టం వచ్చిందనేది ఈ ఛార్జిషీటు సారాంశం. దీంతో భారతి సిమెంట్స్‌లోకి పెట్టుబడి రూపంలో వచ్చిన మొత్తాలకు సరిపడా వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి చెందిన స్థిర, చరాస్థులు, షేర్లు తదితరాలను అటాచ్ చేస్తున్నామని, వీటి విలువ రూ.749 కోట్లదాకా ఉంటుందని ఈడీ తెలియజేసింది. వీటిలో జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంతో పాటు వివిధ కంపెనీలకు బెంగళూరు, హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల్ని  పేర్కొన్నారు. వీటితో పాటు పలు కంపెనీల్లో షేర్లను కూడా అటాచ్ చేస్తున్నట్లు తెలియజేశారు.

2012 అక్టోబరు నుంచి మొదలు...
 వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి ఆయన సంస్థలకు చెందిన ఆస్తుల్ని గడిచిన నాలుగేళ్లుగా ఈడీ అటాచ్ చేస్తూ వస్తోంది. తొలి చార్జిషీట్లో పేర్కొన్న అరబిందో పార్మా, హెటిరోడ్రగ్స్, సాక్షి మీడియాకు సంబంధించిన కొన్ని ఆస్తుల్ని 2012 అక్టోబరు 5న ఈడీ అటాచ్ చేసింది. అప్పటి నుంచి సీబీఐ వేసిన చార్జిషీట్లన్నిటినీ వరసగా తీసుకుంటూ... వాటిలో పేర్కొన్న ఆస్తుల్ని అటాచ్ చేస్తూ వస్తోంది. మొత్తం 11 ఛార్జిషీట్లలో ఇది 8వ చార్జిషీటు.

 అటాచ్‌మెంట్ అంటే..?
 అటాచ్ మెంట్ అంటే ఈ ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపేసే చర్య. అటాచ్‌మెంట్ అయిన ఆస్తుల్ని వాటి హక్కుదార్లు యథాతథంగా ఎప్పటిలానే వాడుతుంటారు. కాకపోతే వాటిని విక్రయించటం గానీ, వాటి తరఫున కొత్త కొనుగోళ్లుగానీ చేయకూడదు. ఈడీ అటాచ్‌మెంట్ ఉత్తర్వుల్ని ప్రతివాదులు ఈడీ న్యాయాధికార సంస్థలో సవాలు చేయొచ్చు. అక్కడ కూడా అటాచ్‌మెంట్‌ను ధ్రువీకరిస్తే దానిపై కూడా అప్పీలు చేయొచ్చు. ఆ తరవాత కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు వంటి ఉన్నతస్థాయి న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేసే వీలుంటుంది.

 న్యాయ ప్రత్యామ్నాయాలున్నాయి...
 జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) జారీ చేసిన అటాచ్‌మెంట్ ఉత్తర్వులు తాత్కాలికమైనవేనని న్యాయవాది అశోక్‌రెడ్డి చెప్పారు. చార్జిషీట్ దాఖలు చేసిన ప్రతిసారీ ఈడీ ఈ విధంగా తాత్కాలిక అటాచ్‌మెంట్ ఉత్తర్వులిస్తోందని తెలిపారు. తమకు న్యాయపరంగా అనేక ప్రత్యామ్నాయాలున్నాయని చెబుతూ... ఈ ఉత్తర్వులను తాము అడ్జుడికేటింగ్ అథారిటీ, అప్పిలెట్ అథారిటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సవాలు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు