తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా పళనిస్వామి

16 Feb, 2017 12:50 IST|Sakshi
తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా పళనిస్వామి
తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి నియమితులయ్యారు. ఆయనను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆహ్వానించారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు పళనిస్వామి తదితరులు లేఖ అందించడంతో గవర్నర్ ఆయనకు ముందుగా అవకాశం కల్పించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాంతో శశికళ వర్గం అధికారాన్ని చేజిక్కించుకున్నట్లయింది. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు ట్రయల్ కోర్టు విధించిన జైలుశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేయడంతో ముఖ్యమంత్రి కావాలన్న శశికళ ఆశలకు గండి పడింది. 
 
దాంతో వెంటనే ఆమె రాష్ట్ర రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్న పళనిస్వామిని తమ వర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే కాక, అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నుకున్నట్లు వెంటనే ప్రకటించారు. దాంతో.. ఆయనకు తొలుత అవకాశం కల్పించాలని గవర్నర్ విద్యాసాగర్‌రావు నిర్ణయించారు. 15 రోజుల్లోగా ఆయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 1954 మార్చి 2న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి.. బీఎస్సీని మధ్యలోనే ఆపేశారు. 80లలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముందునుంచి ఆయన అన్నాడీఎంకేలోనే ఉన్నారు. తొలుత జయలలితకు, ఆమె మరణం తర్వాత శశికళకు ఆయన విధేయుడిగా వ్యవహరించారు. సేలం డెయిరీ చైర్మన్ నుంచి మంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అవుతున్నారు.