ప్రభుత్వం చేతుల్లోనే విద్యారంగం ఉండాలి

13 Sep, 2015 00:32 IST|Sakshi

- ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్:
విద్యారంగాన్ని ప్రభుత్వమే సంపూర్ణంగా నడపాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు ఎలాంటి ఖర్చులు లేకుండా చదువుకోవాలని.. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలని ఆయన అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో ఉచిత విద్య- ప్రభుత్వ బాధ్యత’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ దేశంలోని సాధారణ కుటుంబాల్లో తమ పిల్లల విద్య విషయంలో ఆందోళన ఉందని అన్నారు. ప్రపంచ బ్యాంకు షరతులను ఆనాడు వైఎస్.రాజశేఖరరెడ్డి తిరస్కరించి వారి విధానాలను వ్యతిరేకించడంతో ఆంధ్రప్రదేశ్‌కు అప్పు ఇవ్వమని ప్రపంచ బ్యాంకు వెళ్లిపోయిందని అన్నారు.

వైఎస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఎత్తివేయాలని, సంక్షేమ పథకాల్లో కోత విధించాలని, ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలని షరతులు విధించటంతో వైఎస్సార్ తీవ్రంగా వ్యతిరేకంచారని, దీంతో ప్రపంచ బ్యాంకు ఏపీకి అప్పు ఇవ్వమని వె ళ్లిపోయిందన్నారు. ఏపీకి అప్పు ఎందుకు ఇవ్వలేదో ప్రపంచ బ్యాంకు వారు ఒక నివేదికను తయారు చేశారని, అందులో ఈ విషయాలు ఉన్నాయన్నారు. వైఎస్సార్ ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గకుండా మెండిగా వ్యవహరించటం వల్లనే రాష్ట్రానికి కొంత మేలు జరిగిందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ప్రామాణికమైన విద్యను అందించాలని అన్నారు. నాణ్యమైన విద్య లేకపోవటం వల్లనే కార్పొరేట్ విద్య వచ్చిందన్నారు. పిల్లల కోసమే ీఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చింది కానీ అది కార్పొరేట్ వ్యవస్థకు లాభం చేకూరుస్తుందన్నారు.  కార్యక్రమం లో విద్యాపరిరక్షణ కమిటీ కన్వీనర్ అందె సత్యం, పీడీఎస్‌యూ నాయకులు అశోక్, కాంట్రాక్టు లెక్షరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురే శ్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు