సైకిల్.. ఎవరికీ దక్కకుండా పోతుందా?

8 Jan, 2017 18:54 IST|Sakshi
 
సమాజ్‌వాదీ పార్టీ స్థాపించిన పాతికేళ్ల తర్వాత.. ఆ పార్టీ గుర్తు సైకిల్ ఇప్పుడు ముక్కలు చెక్కలైపోయేలా ఉంది. నాదంటే నాదని తండ్రీకొడుకుల వర్గాలు కొట్టుకుంటుండటంతో ఎవరికీ దక్కకుండా అసలు పూర్తిగా ఆ గుర్తునే ఎన్నికల కమిషన్ రద్దుచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒకసారి విలేకరులు ఇదే అంశాన్ని ప్రస్తావించినపుడు అది ఊహాత్మకమైన ప్రశ్న అని సీఈసీ జైదీ కొట్టి పారేశారు గానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దానికి కూడా అవకాశం ఉంటుందనే అనిపిస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అటు అఖిలేష్ వర్గానికి గానీ, ఇటు ములాయం వర్గానికిగానీ సైకిల్ గుర్తు ఇవ్వకుండా ఆపేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం ఎన్నికల కమిషన్‌కు ఉందని అంటున్నారు. గత వారం పార్టీలో చీలిక వచ్చిన తర్వాత.. పార్టీ గుర్తు అయిన సైకిల్‌ను తనకే కేటాయించాలని ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ఎవరికి వారు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. (ములాయం 'సైకిల్‌' అఖిలేశ్‌కేనా?)
 
ఇప్పటికే యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ప్రచారపర్వం ఊపందుకుంటోంది. కానీ అసలు ఏ గుర్తుతో ప్రచారం చేసుకోవాలోనన్న విషయం తేలకపోవడంతో అభ్యర్థులు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవైపు అఖిలేష్ వర్గంలోని కీలకనేత అయిన రాంగోపాల్ యాదవ్ కట్టలకొద్దీ అఫిడవిట్లు తీసుకుని ఎన్నికల కమిషన్‌కు సమర్పించగా, అందులో ఉన్న సంతకాలన్నీ ఫోర్జరీవేనని ములాయం, అమర్‌సింగ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాటన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి పంపడం కూడా సాధ్యం కాని పని. దాంతో ఎందుకొచ్చిన గొడవ అని పూర్తిగా ఆ గుర్తునే రద్దు చేసి, కొత్త గుర్తులను రెండు వర్గాలకు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎన్నికల కమిషన్ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. సాధారణంగా అయితే మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో సగానికి పైగా మెజారిటీ.. అంటే సాధారణ మెజారిటీ ఎవరికుంటే వాళ్లకు గుర్తు లభిస్తుంది. ఈనెల 17వ తేదీన తొలిదశ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఆలోగానే తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ ఏం చేస్తుందన్న విషయం ఉత్కంఠభరితంగా మారింది. (సీఎం జోరు.. బాబాయ్ బేజారు!)
 
గతంలోనూ ఇలాగే...
గతంలో ఒకసారి ఇలాగే ఒక పార్టీ విడిపోయినప్పుడు గుర్తును రద్దుచేసిన చరిత్ర ఎన్నికల కమిషన్‌లో ఉంది. ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ అనే పార్టీ 2011లో విడిపోయింది. రెండు వర్గాలూ కుర్చీ గుర్తు తమకే కావాలని పట్టుబట్టాయి. దాంతో త్రివేందర్ సింగ్ పవార్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ (పి) వర్గానికి కప్పు-సాసర్, దివాకర్ భట్ నేతృత్వంలోని జనతాంత్రిక్ ఉత్తరాఖండ్ క్రాంతిదళ్‌కు గాలిపటం ఇచ్చింది.
మరిన్ని వార్తలు