బీజేపీ ఎంపీకి ఎన్నికల కమిషన్ నోటీసు

10 Jan, 2017 15:24 IST|Sakshi
బీజేపీ ఎంపీకి ఎన్నికల కమిషన్ నోటీసు
ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు ఇచ్చింది. దానికి బుధవారంలోగా సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో తామే ఎలాంటి సమాచారం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కులమతాల పేరుతో ఓట్లు అడగకూడదని, ఎన్నికల చట్టంలో నేరపూరితమైన చర్యలుగా పేర్కొన్నవాటిని అన్ని పార్టీలు, అభ్యర్థులు పరిహరించాలని తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం ఎన్నికలు దగ్గర్లో ఉండగా మతం పేరుమీద సమాజంలోని వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచడం నేరమని తెలిపారు. 
 
మీరట్‌లో ఈనెల 6వతేదీన నిర్వహించిన ఓ కార్యక్రమంలో సాక్షి మహరాజ్ దేశ జనాభా పెరగడంపై మాట్లాడారు. ''ఒక వర్గానికి చెందిన వ్యక్తి.. నలుగురిని పెళ్లిచేసుకుని, 40 మంది పిల్లల్ని కని, మూడుసార్లు విడాకులు తీసుకుంటాడు. ఇకపై ఇలాంటి పద్ధతిని సహించేది లేదు'' అని సాక్షి మహారాజ్‌ అన్నారు. దానిపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కూడా ఆయనపై మీరట్‌లోని సదర్ బజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు, దానిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. దీంతో.. సాక్షి మహరాజ్ ప్రాథమికంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించిన ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులిచ్చింది. 
 
ఏ వర్గం పేరూ ప్రస్తావించలేదు
ఈసీ నోటీసులకు సాక్షి మహరాజ్ స్పందించారు. తాను ఏ వర్గం సెంటిమెంట్లను దెబ్బతీసేలా ప్రసంగించలేదని, కావాలంటే వీడియో చూసుకోవచ్చని తెలిపారు. తనంతట తానుగా అసలు ఏ వర్గం పేరునూ ప్రస్తావించలేదన్నారు. అయినా నోటీసు కాపీ హిందీలో ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను కోరానని, దేశంలో జనాభా పెరుగుదల గురించి మాత్రమే ఆందోళన వ్యక్తం చేశానని ఆయన చెప్పారు.