పెరగనున్న విద్యుత్ అవసరాలు

1 Aug, 2013 04:36 IST|Sakshi
12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దేశవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు 34.4 శాతం మేరకు పెరగవచ్చని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) 18వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే (ఇపిఎస్)లో అంచనా వేసింది. ప్రస్తుత పంచవర్ష ప్రణాళిక కాలంలో దేశ విద్యుత్ అవసరాలు, వార్షిక పీక్ ఎలక్ట్రిక్ లోడ్‌ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా ఎంత ఉంటుందనేది సీఈఏ మదింపు చేసింది. సర్వే గణాంకాల ప్రకారం విద్యుత్ అవసరాలు 2013-14లో 10,84,610 మిలియన్ యూనిట్ల నుంచి 2016-17లో 13,54,874 మిలియన్ యూనిట్లకు పెరగనున్నాయి. ఇక వార్షిక పీక్ సమయ విద్యుత్ లోడ్ ఈ ఏడాదిలో ఉండే 1,56,208 మెగావాట్ల నుంచి 2016-17లో 1,99,540 మెగావాట్లకు విస్తరించనుంది. 12వ పంచవర్ష ప్రణాళికపై కేంద్ర ప్రణాళిక సంఘం రూపొందించిన ముసాయిదా పత్రం అనుసరించి ఈ ఐదేళ్లలో విద్యుత్ రంగానికి 18.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి, సామర్థ్య జోడింపునకు అనేక చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర ఇంధనశాఖ బుధవారం వెల్లడించింది. 12వ ప్రణాళిక కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 8,770 మెగావాట్ల సామర్థ్య జోడింపును లక్ష్యంగా నిర్దేశించారు.
 ఏపీలో విద్యుత్ అవసరాలపై 
 ఈపీఎస్ అంచనాలు ఇలా..
 2012-13లో 93,189 మిలియన్ యూనిట్లు, 2013-14లో 1,01,231 మిలియన్ యూనిట్లు, 2014-15లో 1,09,968 మిలియన్ యూనిట్లు, 2015-16 లో 1,19,458 మిలియన్ యూనిట్లు, 2016-17లో 1,29,767 మిలియన్ యూనిట్లుగా ఉంది. 
 వార్షిక పీక్ లోడ్ రాష్ట్రంలో ఎలా ఉంటుందంటే...
 2012-13లో 15,553 మెగావాట్లు, 2013-14లో 17,044 మెగావాట్లు, 2014-15లో 18,681 మెగావాట్లు, 2015-16లో 20,476 మెగావాట్లు, 2016-17లో 22,445 మెగావాట్లు.
విద్యుత్ కోతలు పూర్తిగా ఎత్తివేత
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కార్యదర్శి మనోహర్‌రాజు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జల విద్యుత్ ఉత్పత్తి పెరగడం, విద్యుత్ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి విద్యుత్ కోతలు పూర్తిగా ఎత్తివేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు. ప్రస్తుతం సాధారణ పరిశ్రమలకు సా. 6 నుంచి రా. 10 గంటల వరకు కోతలు అమల్లో ఉండగా మరికొన్ని భారీ పరిశ్రమలకు నెలలో ఆరు రోజుల పాటు కోతలు అమలవుతున్నాయి. ఏపీఈఆర్‌సీ నిర్ణయంతో వీటికి నేటి నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కానుంది.

 

మరిన్ని వార్తలు