విద్యుత్ సౌధలో ఆంక్షలు!

20 Nov, 2015 01:07 IST|Sakshi
విద్యుత్ సౌధలో ఆంక్షలు!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ  రాష్ట్ర ఆకాంక్షకు నిలువెత్తు ప్రతిరూపం విద్యుత్ సౌధ.. ఉద్యమ రోజుల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఎక్కడ ఏం జరిగినా విద్యుత్ సౌధ నుంచి తక్షణమే ప్రతిస్పందన వినిపించేది. సమైక్య రాష్ట్ర పాలకులు సైతం విద్యుత్ ఉద్యోగులను నియంత్రించే సాహసం చేయలేకపోయారు. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చి రెండేళ్లయినా కాకముందే విద్యుత్ సౌధలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మీడియాతో ఉద్యోగులెవరూ మాట్లాడొద్దని ఆదేశిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సర్క్యులర్ జారీ చేశారు.

దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే ‘దుష్ర్పవర్తన’ కింద పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి చట్టంలోని 43వ నిబంధనను అడాప్ట్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన జారీ చేసినట్లు పేర్కొంటున్న ఈ సర్క్యులర్‌ను గురువారం ట్రాన్స్‌కో అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడంతో వెలుగు చూసింది.

అనధికారికంగా పత్రికలకు ఏదైనా ప్రకటన చేసినా, పత్రికలు, మేగజైన్‌లలో ఏదైనా వార్త కథనానికి సహకరించినా, ముందస్తు అనుమతి లేకుండా రేడియోలో మాట్లాడినా, మీడియా లేక కరపత్రాల ద్వారా విన్నపాలు వినిపించినా... సదరు ఉద్యోగులపై క్రమ శిక్షణ చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు. ఇక విద్యుత్ సౌధలో ఇటీవల అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సందర్శకుల రాకపోకలపై నిఘా ఉంచుతున్నారు. దీంతో విలేకరులను కలిసేందుకు కొందరు అధికారులు నిరాకరిస్తున్నారు.
 
ఈఆర్సీకి వెళ్లొద్దు..
విద్యుత్ రంగానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)లో వ్యాజ్యాలు వేయవద్దని విద్యుత్ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, చార్జీల పెంపు వంటి వాటికి ఈఆర్సీ ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించే ముందు ఈఆర్సీ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానిస్తుంది.

సాంకేతికంగా క్లిష్టంగా ఉండే విద్యుత్ చట్టాలు, అంశాలపై పట్టున్న విద్యుత్ రంగ నిపుణులు మాత్రమే వీటిపై స్పందించగలుగుతారు. విద్యుత్ రంగ నిపుణులు కె.రఘు, తిమ్మారెడ్డి వంటి కొందరు మాత్రమే ప్రజల తరఫున ఈఆర్సీకి వెళుతున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలతో కె.రఘు వేసిన వ్యాజ్యం ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు ఎవరూ ఈఆర్సీకి వెళ్లవద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి.
 
అలాంటి హక్కు ఎవరికీ లేదు
‘పత్రికలకు సమాచారం ఇవ్వవద్దని సర్క్యులర్ జారీ చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. అలాంటి హక్కు ఎవరికీ లేదు. దీనిని ఖండిస్తున్నాం..’
 - దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్

మరిన్ని వార్తలు