‘అత్యవసర’ మతలబు...

21 Jun, 2015 02:15 IST|Sakshi
‘అత్యవసర’ మతలబు...

ఉరుములు, మెరుపులు లేకుండా, ఎలాంటి ముందస్తు సూచనలే కనిపించకుండా పిడుగు పడినట్లుగా అయ్యిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మళ్లీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ రావొచ్చునంటూ అద్వానీ ముందస్తు హెచ్చరికలు జారీచేయడం అలాంటిదేననే చర్చ జోరుగా సాగుతోంది. లలిత్‌మోదీ వ్యవహారంలో సుష్మాస్వరాజ్ ప్రమేయం బయటపడగానే, పీఎంఓ కార్యాలయం నుంచి మహాపాత్ర అనే అధికారిని సుష్మా ఇంటికి పంపించి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మోదీ తెప్పిం చుకున్నారట. ఈ వార్త తెలిసిన వెంటనే కేంద్రమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పందిస్తూ సుష్మా ఎలాంటి తప్పు చేయలేదు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ సర్టిఫికెట్‌ను ఇచ్చేశారట. దీంతో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సైతం సుష్మాను వెనుకేసుకు రాక తప్పలేదట. ఆ తర్వాత లలిత్‌మోదీతో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే కుమారుడికి వ్యాపార సంబం ధాలు, లలిత్‌మోదీకి అనుకూలంగా వసుంధర వ్యవహరించడంపై సైతం దుమారం రేగింది.
 
 ఆమె కూడా రాజీనామా చేసే పరిస్థితి రావొచ్చునంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కరితో ఇది ఆగకుండా పార్టీలో బలమున్న నేతలు, మంత్రుల విషయంలో ఇటువంటిదే ఏదో ఒకటి జరిగి అందరి పదవులకు ఎసరు రావొచ్చునని ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఏర్పడిందంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుష్మా, వసుంధర, మిత్రపక్షాల నేతలైన చంద్రబాబు, జయలలితతో సహా ఇటువంటి నేతలంతా మెల్లగా రాజ్‌నాథ్‌సింగ్ వెనకకు చేరుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిని గమనించే బీజేపీ కురువృద్ధుడు అద్వానీ  ఎమర్జెన్సీ గురించి మాట్లాడాల్సి వచ్చిందని ఆ పార్టీనేతలే సూత్రీకరణలు చేస్తున్నారు. ఎంత పెద్దస్థాయి నాయకుడినైనా పక్కన పెట్టి మోదీ తన విధానాలతో ముందుకు సాగుతాడనేందుకు సంకేతాలుగానే ఎమర్జెన్సీ చర్చను బీజేపీ అగ్రనేత తెస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. కనీసం స్వపక్షంలోనే మోదీని ఎదుర్కునేలా రాజ్‌నాథ్‌సింగ్‌ను బలోపేతం చేసేందుకు కూడా ఇది జరుగుతోందని ఊహగానాలు సాగుతున్నాయి.
 

whatsapp channel

మరిన్ని వార్తలు