నిర్లక్ష్యానికి రూ.55 వేల జరిమానా

7 Sep, 2015 12:45 IST|Sakshi
నిర్లక్ష్యానికి రూ.55 వేల జరిమానా

చెన్నై: ప్రయాణికుడి వస్తువుల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కు తమిళనాడు రాష్ట్ర వినియోగదారుల ఫోరం రూ. 55 వేల జరిమానా విధించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రయాణికుడిని మనోవేదనకు గురిచేసినందుకు  ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

తమిళనాడుకు చెందిన అశోక్ బాలసుబ్రమణియన్- కమర్షియల్ పైలట్ కోర్సు చేసేందుకు దక్షిణాఫ్రికా వెళ్లాడు. 2008, ఆగస్టు 3న జోహెన్నెస్ బర్గ్ నుంచి దుబాయ్ మీదుగా చెన్నైకు వస్తూ కనెక్టింగ్ విమానం ఎక్కాడు. చెన్నైకు వచ్చిన తర్వాత తన లగేజీ పోయినట్టు గుర్తించిన అశోక్- ఎమిరేట్ ఎయిర్ లైన్స్ ను సంప్రదించాడు. లగేజీ పోయిందని, దీనికి పరిహారంగా 200 డాలర్లు ఇస్తామని ఈ ఏడాది ఆగస్టు 28న అశోక్ కు ఎయిర్ లైన్స్ లేఖ రాసింది. దీంతో అతడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

ఎమిరేట్స్ నిర్లక్ష్యంతో తన కెరీర్ కు నష్టం జరిగిందని, పైలట్ లైసెన్స్, సర్టిఫికెట్లతో పాటు కీలక పత్రాలు పోయాయని వాపోయాడు. తనకు పరిహారంగా రూ.50 లక్షలు ఇప్పించాలని కోరారు. అయితే ముఖ్యమైన పత్రాలు తమ దగ్గరే ఉంచుకోవాలని ప్రయాణికులకు సూచించామని ఎమిరేట్స్ వాదించింది. ఇలాంటి వాదనలతో నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోలేరని ఎమిరేట్స్ కు ఫోరం మొట్టికాయ వేసింది.  రూ.55 వేలు పరిహారం జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు