అలాగైతే అగ్రరాజ్యం కాలేదు: రాహుల్ గాంధీ

25 Jan, 2014 04:36 IST|Sakshi

మహిళలు, యువతకు సాధికారతతోనే అది సాధ్యం: రాహుల్
 సేవాగ్రామ్(మహారాష్ట్ర): మహిళలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, యువతకు సాధికారత కల్పించకుండా భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ముసాయిదా మేనిఫెస్టో రూపకల్పనకోసం వేర్వేరు వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్న రాహుల్‌గాంధీ ఇందులో భాగంగా శుక్రవారమిక్కడ గాంధీ ఆశ్రమంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎన్జీవోలు, అధికారులతో సమావేశమయ్యారు. దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇందులో పాల్గొన్నారు.
 
 రాహుల్ మాట్లాడుతూ.. మహిళలు, యువతకు సాధికారత కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ‘‘దేశ జనాభాలో 50 శాతం మంది మహిళలున్నారు. వీరికి సాధికారత కల్పించనిపక్షంలో భారత్ సగం బలాన్ని, శక్తిని మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే అర్ధ అగ్రరాజ్యంగానే మిగిలిపోతుంది. కోట్లాది యువతకు మనం ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలు కల్పించలేనిపక్షంలో, అలాగే మన సర్పంచులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సాధికారత కల్పించలేనిపక్షంలో మన దేశం అగ్రరాజ్యం కాజాలదు’’ అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు