అసహనాన్ని ఆమోదిస్తున్నారు

4 Nov, 2015 02:26 IST|Sakshi
అసహనాన్ని ఆమోదిస్తున్నారు

 ప్రధాని మోదీపై సోనియా గాంధీ ధ్వజం
♦ సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా సర్కారు తీరు
♦ పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పార్టీ నేతలతో ర్యాలీ
♦ విద్వేషపూరిత ఘటనలపై జోక్యం చేసుకోవాలని ప్రణబ్‌కు వినతి
 
 న్యూఢిల్లీ: మోదీ సర్కారు తీరు దేశంలో సామాజిక, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ తన మౌనం తో ద్వేషపూరిత ఘటనలను ఆమోదిస్తున్నారని విమర్శించారు. దేశంలో పెరిగిపోతున్న అసహన పరిస్థితులను నిరసిస్తూ పార్టీ నేతలతో కలసి మంగళవారం ఆమె పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ నిర్వహించారు. సామరస్యాన్ని దెబ్బతీసే ఘటనలను నిరోధించేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించారు. కొన్ని సంస్థలు దేశంలో భయానక, అసహన వాతావరణం సృష్టించేందుకు యత్నిస్తున్నాయని ప్రణబ్‌కు వివరించారు.

సమాజంలో చీలిక తీసుకువచ్చి సామరస్యాన్ని దెబ్బతీయాలన్న పక్కా ప్రణాళికతోనే ఇలా చేస్తున్నారన్నారు. ‘విద్వేష ఘటనలపై ఏమాత్రం పెదవి విప్పడం లేదు. తద్వారా వాటిని ఆమోదిస్తున్నానన్న సంకేతాన్ని పంపుతున్నారు. ఆయన మంత్రివర్గ సహచరులూ ఇదే ఎజెండాతో సాగుతున్నారు. ఈ పరిణామాలు ప్రతి ఒక్క భారతీయుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాలనే రాష్ట్రపతికి వివరించాం’ అని సోనియా విలేకరులకు తెలిపారు. ద్వేషపూరిత వాతావరణం మంచిది కాదంటూ రాష్ట్రపతి కూడా తన అభిప్రాయం వెలిబుచ్చారని, కానీ ప్రధాని మాత్రం మౌనం వీడడం లేదని అన్నారు. కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు... భిన్న సంస్కృతులు, మతాలకు ఆలవాలమైన సమాజ పునాదులపై దాడికి యత్నిస్తున్నాయన్నారు. ఈ శక్తులపై కాంగ్రెస్ అలుపెరగని పోరు చేస్తుందన్నారు.

 ఇది ప్రతి భారతీయుడి ఆందోళన: రాహుల్
 అసహనంపై రాష్ట్రపతి, ఆర్‌బీఐ గవర్నర్ ఆందోళన వెలిబుచ్చినా ప్రధాని మాత్రం నోరు మెదపడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘దేశంలో అంతా చక్కగా ఉందని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ భావిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. వీరి సిద్ధాంతంలోనే సహనశీలత లేదు. అందుకే అసహనాన్ని నమ్ముతున్నారు. ఇది ఒక్క కాంగ్రెస్‌కే సంబంధించిన అంశం కాదు. ఈ పరిణామాలపై దేశంలో ప్రతి భారతీయుడు ఆందోళన చెందుతున్నాడు’ అని అన్నారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలు అసహనాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. జైట్లీ ఒక్కసారి పల్లెలకు వెళ్లి చూస్తే సమాజంలో ఏం జరుగుతోందో అర్థమవుతుందన్నారు.

అగ్నికి ఆహుతైన దళిత పిల్లలను కుక్కలతో పోల్చిన వీకే సింగ్‌ను కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించాలని అన్నారు.  ఇందిరగాంధీ హత్య అనంతరం 1984లో జరిగిన సిక్కుల ఊచకోతపై విలేకరులు ప్రశ్నించగా రాహుల్ సమాధానం దాటవేశారు. రాష్ట్రపతిని కలిసిన నేతల బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ అజాద్, ఏకే ఆంటోనీ సహా మొత్తం 125 మంది ఉన్నారు. అసహన పరిస్థితులపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసినందుకు రాష్ట్రపతికి కాంగ్రెస్ బృందం కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని వార్తలు