ఎండోస్కోపీ చికిత్సతో ఎసిడిటీకి చెక్

31 Dec, 2015 08:39 IST|Sakshi
ఎండోస్కోపీ చికిత్సతో ఎసిడిటీకి చెక్

* దేశంలోనే తొలిసారిగా ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స
* ఔట్ పేషెంట్‌గా వచ్చి అరగంటలో చికిత్స చేయించుకుని వెళ్లొచ్చు
* దీంతో శాశ్వతంగా ఎసిడిటీకి చెక్ పెట్టవచ్చన్న చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: ఎండోస్కోపీ చికిత్సతో ఎసిడిటీకి పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం జపాన్‌లోనే ఈ చికిత్స జరుగుతోందని.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తమ ఆస్పత్రిలోనే ఈ పద్ధతిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

బుధవారం ఆయన తాజ్ కృష్ణా హోటల్‌లో డైరెక్టర్ జీవీ రావుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎసిడిటీని నిర్లక్ష్యం చేస్తే అది చివరకు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందన్నారు. మందుల వాడకం వల్ల దుష్ఫలితాలు వస్తాయని, అందుకే ఈ చికిత్స సరైందని అన్నారు. జపాన్‌లో ఈ చికిత్సకు రూ. 5లక్షల వరకు ఖర్చవుతుండగా.. తాము రూ. 30 వేల నుంచి రూ. 40 వేలకే చేస్తున్నామన్నారు.

తిరుపతికి చెందిన స్టాఫ్ నర్స్ అమ్ములు నాలుగేళ్లుగా ఎసిడిటీతో బాధపడుతుంటే ఆమెకు ఈ చికిత్స విజయవంతంగా చేశామన్నారు. ఎండోస్కోపీ విధానం అనేది శస్త్రచికిత్స కాదని.. కేవలం ఎండోస్కోపీ టెక్నిక్‌గా ఆయన అభివర్ణించారు. అన్నవాహికకు, జీర్ణాశయానికి మధ్యలో ఉండే కవాటాన్ని కొత్తగా కృత్రిమ పద్ధతుల్లో ప్రవేశపెట్టడమే ఈ వైద్య విధానమన్నారు. కణాలతో కవాటాన్ని సృష్టించి ఈ చికిత్స చేస్తామన్నారు.

దీన్నే యాంటీ రిఫ్లక్స్ ముకోసాల్ రిఫ్లెక్షన్ (ఆర్మ్స్) అంటారని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఈ విధానంలో చికిత్స చేయించుకుంటే భవిష్యత్తులో ఎసిడిటీ సమస్య తలెత్తదన్నారు. 2 వేల ఏళ్లుగా మనుషులకు ఎసిడిటీ వస్తూనే ఉందని, దేశంలో రోజురోజుకూ ఎసిడిటీ సమస్య పెరిగిపోతోందన్నారు. జైపూర్‌లో 22 శాతం మందికి, ఢిల్లీలో 17 శాతం, చెన్నైలో 10 శాతం, హైదరాబాద్‌లో 25 శాతం, ఏపీలో 24 శాతం మంది ఎసిడిటీతో బాధపడుతున్నారని చెప్పారు. జీవన విధానం మారడం వల్లే ఎసిడిటీ, కడుపులో మంట వస్తుందన్నారు. దాంతోపాటు వ్యాయామం లేకపోవడం మరో ప్రధాన కారణమన్నారు. ఆర్మ్స్ వైద్య చికిత్స విధానాన్ని జపాన్‌కు చెందిన వైద్యుడు కనుగొన్నారని, ఇది వైద్య రంగంలో విప్లవమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు