ఉపాధి లేని చదువులేల?

6 Aug, 2015 02:06 IST|Sakshi
సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

* ఇంజనీరింగ్ చేసి కూలి పనులా?
* విద్యాశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్
* ఇక ఉపాధే లక్ష్యంగా చదువులుండాలి
* సాంకేతిక విద్యను సమూలంగా మార్చాలి
* కొత్త లెక్చరర్లతో సమర్థంగా డిగ్రీ కోర్సులు
* మానవ వనరుల అవసరాలు గుర్తించండి
* మైనారిటీలకు జిల్లాకో హాస్టల్, గురుకులం
* గురుకుల విద్యంతా ఒకే గొడుగు కిందకు..
* గురుకులాల్లో గ్రాముల లెక్కన భోజనమేంది?... బఫే విధానంలో విద్యార్థులకు తిన్నంత పెట్టాలని ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు హోంగార్డులుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తుండటం సిగ్గుచేటు. మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించని చదువులెందుకు? సాంకేతిక విద్యను సమూలంగా మార్చేయండి. ప్రభుత్వమే గాక ప్రైవేటు రంగంలోనూ ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. ఆయా రంగాల అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందించండి. అవి యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా చూడండి. రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేయండి’’ అని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కేజీ టు పీజీ, ఉన్నత విద్యా రంగంపై ఆయా విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా సచివాలయంలో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
 
 పలు శాఖల కింద పనిచేస్తున్న రెసిడెన్షియల్ విద్యా సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని ఆదేశించారు. ప్రస్తుతం 668 గురుకులాలుండగా, నియోజకవర్గానికి సగటున 10 చొప్పున వాటిని రాష్ట్రవ్యాప్తంగా 1,190కి పెంచాలన్నారు. 12వ తరగతి వరకు వాటిలో పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలని, ఎస్సీ, ఎస్టీలందరికీ ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. ‘‘ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకులాలు మెరుగ్గా నడుస్తున్నాయి. అన్నీ అదే నమూనాలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ తదితర విభాగాలుగా గురుకులాలు నడుస్తుండటం, ఒక్కోదాంట్లో ఒక్కో విధానం, ఒక్కోరకం మెస్ చార్జీలుండటం సరికాదు. అన్నింటిలో ఒకే రకమైన విద్య, వసతులు కల్పించండి. విద్యార్థులకు గ్రాముల చొప్పున భోజనమేమిటి? ఇకపై అలా కాకుండా బఫే పద్ధతిలో వారికి తిన్నంత భోజనం పెట్టాలి’’ అని ఆదేశించారు. ‘‘పిల్లలు నాలుగో తరగతి దాకా తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి. ఆ మేరకు గ్రామ స్థాయిలోనేవిద్యా బోధన జరగాలి. తరవాత మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పాలి’’ అన్నారు.
 
 దళిత అమ్మాయిలకూ ప్రత్యేక హాస్టళ్లు
 రాష్ట్రంలో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉండగా, వారికి హాస్టళ్లు తక్కువగా ఉన్నాయని సీఎం అన్నారు. ‘‘రాష్ట్రంలో 3,000 హాస్టళ్లుండగా మైనారిటీ విద్యార్థులకు 21 మాత్రమే ఉన్నాయి. అందుకే ప్రతి జిల్లాలో మైనారిటీ విద్యార్థులకు ఒక రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మైనారిటీ బాలికలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ప్రత్యేక వసతి, సదుపాయాలు కల్పిస్తే పై చదువులు చదువుతారు’’ అని చెప్పారు. దళిత అమ్మాయిల కోసం కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు.
 
 చదువంటే ఇంజనీరింగ్, మెడిసినే కాదు
 చదువంటే ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమేనన్న భావనను పోగొట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సాంకేతిక విద్యలో మార్పులు తేవాలన్నారు. సమాజానికి అవసరమయ్యే సేవలేమిటి, అందుకు విద్యార్థులను ఎలా తయారు చేయాలి, ఏ వృత్తిలో ఎందరు అవసరం వంటి విషయాలను గుర్తించి చర్యలు చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించారు. ఐటీఐలనూ విద్యా శాఖే నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగావకాశాలను గుర్తించి డిగ్రీలో తదనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు.
 
  ‘‘దీనిపై విద్యార్థులకూ అవగాహన కల్పించండి. పోటీ పరీక్షలంటే పబ్లిక్‌సర్వీసు కమిషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలేనన్న భావన పట్టభద్రుల్లో ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరెన్నో ఉద్యోగాలున్నాయని డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు తెలిసేలా చేయాలి. డిగ్రీ చదువుతూనే ఏం చేయాలో వారిలో స్పష్టత తేవాలి. డిగ్రీ కోర్సులను మరింత సమర్థంగా నిర్వహించాలి. అందుకవసరమైన లెక్చరర్ల నియామకాన్ని పూర్తి చేస్తాం. ద్వితీయ భాషగా తెలుగు, ఉర్దూలను ఎంచుకునే వెసలుబాటు కల్పించాలి. అప్పుడే ఇంగ్లిష్ మీడియం వారికి మాతృభాషపై పట్టుంటుంది’’ అన్నారు.
 
 అనాథలకు స్టేట్ చిల్డ్రన్‌గా గుర్తింపు
 అనాథ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘‘వారికి రాష్ట్ర ప్రభుత్వమే తల్లీతండ్రి అని ప్రకటించినందున వారి పోషణ, రక్షణ బాధ్యత తీసుకోవాలి. అనాథ పిల్లలను స్టేట్ చిల్డ్రన్‌గా గుర్తించండి. పది పూర్తయిన వారిని ఇంటర్‌కు గురుకులాల్లో చేర్పించండి’’ అని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు