ఆన్‌లైన్‌లోనే మేనేజ్‌మెంట్ కోటా భర్తీ

23 Aug, 2013 01:13 IST|Sakshi
ఆన్‌లైన్‌లోనే మేనేజ్‌మెంట్ కోటా భర్తీ

ఇంజనీరింగ్ సీట్లకు మళ్లీ నోటిఫికేషన్
రేపు విడుదల చేస్తాం: ఉన్నత విద్యామండలి
సింగిల్ పోర్టల్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
విద్యార్థులు నేరుగా కూడా సమర్పించవచ్చు
జీవో 66 ప్రకారం ఎంపిక ప్రక్రియ
పాత నోటిఫికేషన్ ఉపసంహరణ

 
 సాక్షి, హైదరాబాద్: హైకోర్టు తాజా తీర్పునకు అనుగుణంగా, జీవో 66, 67 ప్రకారం ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీని ప్రకారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన వెబ్ పోర్టల్‌లో అన్ని కళాశాలల దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆ వెబ్ పోర్టల్‌లో విద్యార్థి తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకుని, నచ్చిన కోర్సును ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తును పూరించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు అధ్యక్షతన గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
 
  ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం.డోబ్రియాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ మీడియాతో ఈ వివరాలు వెల్లడించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ నెల 13న జీవో 74 ప్రకారం సీట్లు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాక యాజమాన్యాలు ఆ కేసుకు సంబంధించిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాయి. దీంతో హైకోర్టు కూడా తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని జీవో 66, 67 ప్రకారం ఆన్‌లైన్‌లో భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి పాత నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుని, శనివారం కొత్త నోటిఫికేషన్ జారీచేయనుంది.
 
 నేరుగానూ సమర్పించవచ్చు..
 అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే కాకుండా నేరుగా కూడా యాజమాన్యానికి దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు వివరించారు. ఒక అభ్యర్థి పలు కళాశాలలకు దరఖాస్తు చేసుకున్న పక్షంలో అన్ని కళాశాలల్లో సీటు వస్తే.. ఆ సీటు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. హైకోర్టు ఆదేశించినట్టుగా పిటిషన్‌దారులైన పలువురు కళాశాలల యాజమాన్యాలతో మండలి సమావేశం ఏర్పరిచి ఇలా బ్లాక్ అయ్యే పరిస్థితికి ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించేందుకు చర్చించనుంది.
 
 ఎంపిక అధికారం కళాశాలలకే..
 జీవో 66, 67 ప్రకారం కళాశాలలు యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసుకునేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) వెబ్‌పోర్టల్‌ను రూపొందిస్తుంది. కళాశాలలు, విద్యార్థులకు సింగిల్ విండో తరహాలో వెసులుబాటు ఉండేందుకు ఈ పోర్టల్ ఏర్పాటు చేస్తారు. దరఖాస్తుల నుంచి ప్రతిభాక్రమం, ఎంపిక జాబితాను యాజమాన్యాలే రూపొందించుకునేందుకు ఈ వెబ్‌పోర్టల్ అధికారం కల్పిస్తుంది. విద్యార్థులు ఈ వెబ్‌పోర్టల్‌లో తాము కోరుకున్న కళాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ని కళాశాలలు ఎంచుకుంటే అన్ని దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
 
  కళాశాలలు దరఖాస్తు రుసుం వసూలు చేసుకోవచ్చు. ఎన్నారై కోటా, జేఈఈ-మెయిన్, ఎంసెట్, ఇంటర్ మార్కులు.. ఇలా అన్ని కేటగిరీలూ వర్తించే విద్యార్థులు.. వాటికి ప్రాధాన్యక్రమం ఎంచుకునే అవకాశమూ ఉంటుంది. విద్యార్థులు ఇంటర్నెట్‌లో పోర్టల్ ఓపెన్ చేసి కాలేజెస్ మెనూను క్లిక్ చేసి కావాల్సిన కళాశాలను క్లిక్ చేశాక అందులో అందుబాటులో ఉన్న సీట్లు, దరఖాస్తు రుసుం కనిపిస్తాయి. సీటుకు దరఖాస్తు చేసేందుకు ‘అప్లై ఆన్‌లైన్ బటన్’ నొక్కాక దరఖాస్తు ఫామ్ వస్తుంది. వివరాలన్నీ నింపి బ్రాంచీలను ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు దరఖాస్తు రుసుంతో పాటు సీజీజీకి యూజర్ చార్జీలు చెల్లించాలి. వీటిని ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు లేదా నగదు రూపంలో ప్రభుత్వ అధీకృత కేంద్రాల్లోనూ చెల్లించే సదుపాయం ఉంటుంది. సంబంధిత మార్గదర్శకాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి శనివారం విడుదల చేయనుంది.
 
 స్వీకరించిన దరఖాస్తుల పరిస్థితి ఏంటి?
 ఆగస్టు 13న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పత్రికల్లో ప్రకటనలు జారీచేసి దరఖాస్తులు స్వీకరించిన కళాశాలల పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ఉన్నత విద్యామండలి వద్ద సమాధానం లేదు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఆగస్టు 13న నోటిఫికేషన్ ఇచ్చామని, కళాశాలల యాజమాన్యాలు పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో హైకోర్టు కూడా ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకుందని, ఆ నేపథ్యంలోనే ఆగస్టు 13నాటి ప్రకటనను ఉపసంహరించుకుంటున్నామని ైచైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పేర్కొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా