బీటెక్ బాబులు.. రూ. 8.6 కోట్లు కొట్టేశారు!

22 Mar, 2016 08:33 IST|Sakshi
బీటెక్ బాబులు.. రూ. 8.6 కోట్లు కొట్టేశారు!

వాళ్లంతా బీటెక్ బాబులు. ఇంజనీరింగ్ చదువుతున్నారు. నలుగురైదుగురు కలిశారు. సులభంగా డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించారు. ఓ బ్యాంకు మొబైల్ వాలెట్ లావాదేవీలను చూశారు. అందులో వాళ్లకు ఓ లొసుగు కనిపించింది. అంతే, సులభంగా దాన్ని పట్టేసి, ఏకంగా రూ. 8.6 కోట్లు కొట్టేశారు. అయితే చివరకు పోలీసుల చేతికి మాత్రం చిక్కారు. బ్యాంకులతో పాటు కస్టమర్లకు కూడా టోపీలు పెడుతున్న కుర్రాళ్ల తీరు చూసి పోలీసులు నోళ్లు వెళ్లబెడుతున్నారు. డిసెంబర్ నెలలో వాలెట్ ట్రాన్సాక్షన్లు మొదలుపెట్టిన ఓ ప్రైవేటు బ్యాంకు, అందులో ఓ లోపం ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయింది. కస్టమర్ తన సొంత వ్యాలెట్ నుంచి మరో వ్యాలెట్ హోల్డర్‌కు డబ్బు పంపాలనుకుంటే.. అప్పుడు కావాలనో అనుకోకుండానో మధ్యలో ఇంటర్‌నెట్ కనెక్షన్ ఆగిపోతే అతడి బదులు బ్యాంకే అవతలి వ్యక్తికి డబ్బు కట్టేస్తోంది. ఇవతల మొదట కట్టాలనుకున్నవాళ్లకు మాత్రం ఖాతాలో డబ్బు యథాతథంగా మిగిలిపోతోంది. ఇలా తమ ఖజానాలోంచి రూ. 8.6 కోట్లు వెళ్లిపోయే వరకు బ్యాంకుకు ఆ విషయం తెలియనే లేదు.  

కోల్‌కతాలో జరిగిన ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిదిమందిని డిటెక్టివ్ శాఖ అరెస్టు చేసింది. వాళ్లలో ఐదుగురు విద్యార్థులుండగా, బీటెక్ బాబు జ్యూయెల్ రాణా ఈ గ్యాంగుకు లీడర్‌గా వ్యవహరించాడు. వీళ్లందరికీ ముందే యాక్టివేట్ చేసిన ప్రీపెయిడ్ సిమ్‌కార్డులు వేల సంఖ్యలో ముర్షీదాబాద్ జిల్లా నుంచి అందాయి. ఏమీ తెలియని గ్రామీణులకు ఈ సిమ్‌కార్డులు ఇచ్చి వాటితో బ్యాంకులో అకౌంట్లు, వాలెట్లు తెరవాల్సిందిగా చెప్పేవారు. అందుకోసం వారికి కొంత సొమ్ము కూడా ఆశ చూపించారు. హబీబుర్ రెహ్మాన్ అనే మొబైల్ సర్వీసు ప్రొవైడర్‌కు జ్యూయెల్ రాణా తెలుసని, అతడి ద్వారానే సిమ్ కార్డులు అందుకుని ఈ వ్యవహారం అంతా నడిపాడని జాయింట్ సీపీ దేవాశీష్‌ బోరల్ తెలిపారు. కోల్‌కతా, ముర్షీదాబాద్ ప్రాంతాల్లో ఏకంగా 2వేల ఖాతాలు ఓపెన్ చేసి, వాటి ద్వారా వేలాది లావాదేవీలు నడిపించాడు.

వాలెట్ యాప్‌లు కనీసం ప్రాథమిక నియమాలను కూడా పాటించడం లేదని, వాళ్లు ఒక లావాదేవీ జరిగేటప్పుడు కనీసం డేటాను ఎన్‌క్రిప్ట్ కూడా చేయకపోవడంతో తమకు తలనొప్పులు తప్పట్లేదని సీనియర్ డిటెక్టివ్ అధికారి ఒకరు తెలిపారు. సిద్దార్థ భన్సాలీ అనే ఈ మార్కెటింగ్ కన్సల్టెంటు వ్యాలెట్‌నే ఎవరో హ్యాక్ చేసి అందులో డబ్బు కొట్టేశారని అన్నారు. భన్సాలీ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి వాలెట్ కంపెనీతో నెలల తరబడి పోరాడిన తర్వాత ఆయన డబ్బుతో పాటు పరిహారం కూడా ఇస్తామని చెప్పారు. తగిన సెక్యూరిటీ ఫీచర్లను పాటిస్తే తప్ప.. వాలెట్లతో ఇటు ఖాతాదారులు, అటు బ్యాంకులు కూడా సొమ్ము పోగొట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని అంటున్నారు.

మరిన్ని వార్తలు