దుర్గాశక్తకి అన్యాయం జరగనివ్వొద్దు.. ప్రధానికి సోనియా లేఖ

3 Aug, 2013 20:19 IST|Sakshi
దుర్గాశక్తికి అన్యాయం జరగనివ్వొద్దు.. ప్రధానికి సోనియా లేఖ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శక్తిమంతమైన ఇసుక మాఫియాపై పోరాడి, రాజకీయ జోక్యంతో సస్పెండైన మహిళా ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా కలగజేసుకున్నారు. స్వార్థ ప్రయోజనాలకు ఎదురొడ్డి నిలబడినందుకు ఆమెను శిక్షించకూడదంటూ ప్రధాని మన్మోహన్ సింగ్కు సోనియా ఓ లేఖ రాశారు. అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిలబడి, ప్రజా ప్రయోజనాలను కాపాడారంటూ దుర్గాశక్తి నాగ్పాల్ను ఆమె ప్రశంసించారు. ఆమెను తగిన కారణం లేకుండానే సస్పెండ్ చేసినట్లు తెలిసిందని చెప్పారు. ఆమెకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అవసరం మనకుందని ప్రధానికి ఆమె చెప్పారు.

అయితే, సోనియా వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ నేత నరేష్ అగర్వాల్ తీవ్రంగా స్పందించారు. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో తన అల్లుడు రాబర్ట్ వాద్రా చేస్తున్న భూకబ్జాల గురించి కూడా ప్రధానికి సోనియా మరో రెండు లేఖలు రాయాలని సూచించారు. అలాగే, హర్యానాలో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను అక్కడి ముఖ్యమంత్రి సస్పెండ్  చేసినందుకు దానిపైన, రాజస్థాన్లో ఇద్దరు ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయంపైనా ప్రధానికి ఆమె లేఖలు రాయాలని చెప్పారు. ఈ రెండు సందర్భాల్లోనూ రాబర్టా వాద్రా జోక్యం ఉందన్న ఆరోపణలొచ్చాయి. హర్యానాలో రాబర్ట్ వాద్రా భూమి కుంభకోణాలకు పాల్పడిన వ్యవహారాన్ని ఖేమ్కా బయటకు తేగా.. ఆ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.

మరిన్ని వార్తలు