పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగనివ్వండి: మన్మోహన్

4 Aug, 2013 04:38 IST|Sakshi

పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే సభ సజావుగా జరిగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ కోరారు. సభలో ఆటంకాల వల్ల గత రెండు, మూడు పార్లమెంటు సమావేశాల్లో చాలా సమయం వృథా అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సభ ముందుకు ఆహార భద్రత ఆర్డినెన్స్‌తోపాటు కీలకమైన బిల్లులు రానున్నాయని, వాటి ఆమోదానికి సహకరించాలని కోరారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారమిక్కడ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి ప్రధానితోపాటు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. భేటీ అనంతరం ప్రధాని విలేకరులతో మాట్లాడారు. ‘‘గత రెండు, మూడు పార్లమెంటు సమావేశాల్లో సమయం వృథా అయింది. ఈసారి సమావేశాలు నిర్మాణాత్మకంగా సాగాలని కోరుకుంటున్నాను. అందుకు విపక్షాలు సహకరించాలని వినయంగా కోరుతున్నా. కీలక బిల్లులు సభ ముందు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదు నుంచి ఆరు ఆర్డినెన్స్‌లు సభ ముందుకు రావాల్సి ఉంది. వాటిలో ఆహార భద్రత ఆర్డినెన్స్ కీలకమైంది. దాన్ని ఆమోదించే విషయంలో పార్లమెంటు తన విజ్ఞతను ప్రదర్శిస్తుందని భావిస్తున్నా’’ అని అన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్షాలు హామీ ఇచ్చినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ చెప్పారు.
 
ఎన్నికల కోసమే తెలంగాణ: తృణమూల్
అఖిలపక్ష సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ తెలంగాణ అంశాన్ని లేవనెత్తినట్టు తెలిసింది. తెలంగాణపై ప్రకటన నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లోని గూర్ఖాలాండ్‌లో ప్రత్యేక ఉ ద్యమం రాజుకుందని ఆందోళన వ్యక్తంచేసింది. వేరే ఏ ఇతర రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేయబోమంటూ హోంమంత్రి షిండే ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. లేకుంటే దేశంలో అల్లకల్లోలం చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘‘ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ తెలంగాణను ప్రకటించింది. దీంతో దేశంలో అలజడి రేగుతోంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని విడదీసేందుకు యత్నిస్తున్నారు. కానీ అది జరగదు..’’ అని సమావేశం తర్వాత తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విలేకరులతో అన్నారు. ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఆహార భద్రత బిల్లు, తెలంగాణ అంశాన్ని ముందుకు తెస్తోందని సమాజ్‌వాది పార్టీ ఎంపీ శైలేంద్ర కుమార్ విమర్శించారు. ఈ సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయని తాను భావించడం లేదన్నారు. అయితే తెలంగాణ పాత అంశమే అని, దీనిపై సభలో దుమారం రేగే అవకాశం లేదని మంత్రి కమల్‌నాథ్ చెప్పారు. సభ కేవలం 12 రోజులే సమావేశం కానుండడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం లేవనెత్తిన నేపథ్యంలో అవసరమైతే సమావేశాలను పొడిగిస్తామని తెలిపారు. ముందస్తు ఎన్నికలపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపడేశారు. ఈ వర్షాకాల సమావేశాలే చివరివి కావని, దీంతోపాటు శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతాయని చెప్పారు.
 
 న్యాయ వ్యవస్థ చొచ్చుకొస్తోంది: శాసన వ్యవస్థలోకి న్యాయవ్యవస్థ చొచ్చుకొస్తోందని అఖిలపక్ష భేటీలో పార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి. పార్లమెంటు ఔన్నత్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, జడ్జీల నియామక బిల్లును ప్రవేశపెట్టాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల అధికారాలపై చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరాయి. రాజకీయ నేతలు పోటీ చేయాలో వద్దో సుప్రీంకోర్టు చెప్పడం ఏమిటని తృణమూల్, డీఎంకే నేతలు ప్రశ్నించారు. కాగా, ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ వరదలు, సీబీఐ, ఐబీ మధ్య విభేదాలు తదితర అంశాలను ఈ సమావేశాల్లో లేవనెత్తుతామని ట్విట్టర్‌లో ఆమె పేర్కొన్నారు.
 
 ఈ సమావేశాల్లోనూ దుమారమే!
 గడిచిన రెండు పార్లమెంటు సమావేశాల్లానే ఈ వర్షాకాల సమావేశాలనూ విపక్షాలు స్తంభింపజేసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందని యూపీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఆహార భద్రత బిల్లుపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఈ బిల్లులో తాము సూచించిన సవరణలు చేస్తేనే మద్దతిస్తామని బీజేపీ ఇప్పటికే స్పష్టంచేసింది. ఇక నేరుగా సభలో బిల్లు పెట్టి చట్టం చేయకుండా ‘ఆహార భద్రత ఆర్డినెన్స్’ తీసుకురావడంపై అన్నా డీఎంకే మండిపడుతోంది. దీనికితోడు తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పడంతో విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సభలో సమైక్యవాణి వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అస్సాం, పశ్చిమ బెంగాల్, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్‌లోనూ ‘ప్రత్యేక’ డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు అంశం సభలో గందరగోళం సృష్టించవచ్చని భావిస్తున్నారు. బీమా, పెన్షన్ రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతించే బిల్లులతోపాటు ప్రత్యక్ష పన్నుల బిల్లు, కంపెనీల బిల్లు వంటివి సభ ముందుకు రానున్నాయి. ద్రవ్యోల్బణం, రూపాయి పతనం అంశాలు కూడా సభలో దుమారాన్ని రేపే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు