ఆ అధ్యక్షుడి పేరుతో కేఫ్‌

13 Jul, 2017 16:00 IST|Sakshi
ఆ అధ్యక్షుడి పేరుతో కేఫ్‌

ఢాకా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కేఫ్ ఏర్పాటయింది. సైఫుల్‌  ఇస్లాం అనే వ్యాపారవేత్తకు ట్రంప్ అంటే చచ్చేంత అభిమానం. ఈ అభిమానంతోనే ఆయన రాజధానిలో ట్రంప్ కేఫ్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు వెంటనే ఓకే చేయలేదు. ఈ కేఫ్‌కు, అమెరికా అధ్యక్షుడుతో ఎలాంటి సంబంధం లేదని, తానే పూర్తి యజమానిని అని సైఫుల్‌ ఇస్లాం నిరూపించుకోవాల్సి వచ్చింది.ఇందులో స్పెషల్ ట్రంప్ కాక్‌టెయిల్‌ అనబడే గ్రీన్ ఆపిల్ మాక్‌టెయిల్‌తోపాటు ఇండియన్‌, చైనీస్‌, థాయ్‌ వంటకాలు ఉంటాయి. సైఫుల్‌ దగ్గరి బంధువు ఒకరు అమెరికాలో ట్రంప్ గ్రూప్‌కు చెందిన రెస్టారెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

ఆయనే తనకీ  ఈ ఐడియా చెప్పారని సైఫుల్‌ తెలిపారు. స్వతహాగా ట్రంప్ అభిమానిని కావటంతో ఈ  వెంచర్‌కు పూనుకున్నానని చెప్పారు. తనకు గానీ, తన హోటల్‌తోగానీ ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆయన పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని  సైఫుల్‌ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను చూసి అందరూ జోకర్‌గా భావిస్తుంటారని, కానీ తనకు మాత్రం ఆయనే స్ఫూర్తి అని చెప్పారు.

ఆయన ప్రారంభించిన ఎన్నో వ్యాపారాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని, అందుకే ఆయనంటే తనకెంతో ఇష్టమని సైఫుల్‌ తెలిపారు. ఈ రెస్టారెంట్ వద్ద ఏర్పుటు చేసిన ట్రంప్ భారీ కటౌట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని సెల్ఫీలు తీసుకుంటున్నారు.  కేఫ్‌ వైఫై పాస్‌వర్డ్‌ కూడా ట్రంప్‌ కుటుంబసభ్యుల పేరిటే ఉందని సమాచారం. ఈ రెస్టారెంట్ రెండు నెలల క్రితమే ప్రారంభమైనప్పటికీ మరోసారి గ్రాండ్ ఓపెనింగ్ చేయించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు