పోస్కో ప్రాజెక్ట్‌కు ‘గ్రీన్’ సిగ్నల్

11 Jan, 2014 01:08 IST|Sakshi
పోస్కో ప్రాజెక్ట్‌కు ‘గ్రీన్’ సిగ్నల్

 పోస్కో:  దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ ఒడిశాలో రూ.52 వేల కోట్లతో నిర్మిస్తోన్న ఉక్కు ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి లభించింది. అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు ఎనిమిదేళ్ల తర్వాత అనుమతి లభించింది. సామాజిక బాధ్యత కింద పోస్కో కంపెనీ 60 కోట్ల డాలర్ల కార్యక్రమాలు(ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడుల్లో 5%) చేపట్టాల్సి ఉంటుందన్న షరతుతో పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ జియన్ వారం రోజుల్లో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ అనుమతి లభించింది. పోస్కో కంపెనీ 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో జగత్సింగ్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. పోస్కో ఈ ప్రాజెక్ట్‌లో  స్టీల్ ప్లాంట్, పోర్ట్ ప్రాజెక్ట్‌లను చేపట్టింది. ప్రభుత్వం దీనిని స్టీల్ ప్లాంట్, పోర్ట్ ప్రాజెక్ట్‌లుగా విడగొట్టి స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే పర్యావరణ అనుమతులిచ్చింది. కాగా స్టీల్ ప్లాంట్ తొలి దశ నిర్మాణం 2018కల్లా పూర్తవుతుందని అంచనా.
 

మరిన్ని వార్తలు