సంపద శంషేర్

18 Feb, 2015 02:02 IST|Sakshi
సంపద శంషేర్

 ఈ ఏడాది తొలి 45 రోజుల్లో రూ. 5.5 లక్షల కోట్ల మేర పెరిగిన సంపద
 రూ. 104 లక్షల కోట్లకు చేరిన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ

 
 న్యూఢిల్లీ: షేర్లలో ర్యాలీ తోడ్పాటుతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 5.5 లక్షల కోట్ల పైచిలుకు పెరిగింది. ఈ క్రమంలో అన్ని లిస్టెడ్ కంపెనీల వేల్యుయేషన్ ఏకంగా రూ. 103.88 లక్షల కోట్లకు చేరింది. గతేడాది మొత్తంమీద ఇన్వెస్టర్ల సంపద రూ. 28 లక్షల కోట్ల మేర  పెరగ్గా, 2014 డిసెంబర్ ఆఖరు నాటికి అన్ని లిస్టెడ్ కంపెనీల వాల్యుయేషన్లు రూ. 98.36 లక్షల కోట్లకు పెరిగింది.  తాజాగా బడ్జెట్లో మరిన్ని సంస్కరణలు ఉండొచ్చన్న అంచనాలతో ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్ 1,600 పాయింట్లు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరగడానికి.. లిస్టెడ్ కంపెనీల సంఖ్య పెరగడమూ ఒక కారణమేనని వివరించాయి. ప్రస్తుతం లిస్టెడ్ కంపెనీల సంఖ్య 5,595గా ఉంది.
 
 గతేడాది నవంబర్‌లో బీఎస్‌ఈలోని అన్ని లిస్టెడ్ సంస్థల మార్కెట్ విలువ తొలిసారిగా రూ. 100 లక్షల కోట్ల స్థాయిని తాకింది. 2014లో 30 శాతం ర్యాలీ చేసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటిదాకా 6 శాతం పెరిగింది. జనవరి 30న 29,844 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ ఇప్పుడు కూడా కీలకమైన 29,000 పాయింట్ల ఎగువనే ట్రేడవుతోంది. 2014లో సెన్సెక్స్ 6,329 పాయింట్లు పెరిగింది. 2009 నాటి 7,817 పాయింట్ల పెరుగుదల తర్వాత సెన్సెక్స్ భారీగా (1600 పాయింట్లు) ఎగియడం మళ్లీ ఈ ఏడాదే. ఇక, అత్యధిక మార్కెట్ విలువగల కంపెనీగా ఐటీ దిగ్గజం టీసీఎస్ కొనసాగుతోంది. ఈ సంస్థ వాల్యుయేషన్ రూ. 5,06,380.15 కోట్లుగా ఉంది. టీసీఎస్ తర్వాత ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ .. టాప్ 5 కంపెనీల్లో ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 43,000 కోట్లు (7 బిలియన్ డాలర్లు) భారత క్యాపిటల్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేశారు.
 
 తాజాగా బడ్జెట్‌కి ముందు మార్కెట్లు కాస్త హెచ్చుతగ్గులకు లోను కావొచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ తెలిపారు. కొత్త ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టబోతున్న పూర్తి స్థాయి బడ్జెట్ గురించి ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన వివరించారు.
 

>
మరిన్ని వార్తలు