తన్నులు తిన్నోళ్లపైనే కేసులా?

29 Sep, 2015 04:31 IST|Sakshi
తన్నులు తిన్నోళ్లపైనే కేసులా?

♦ కన్నీటి పర్యంతమైన ఎర్రబెల్లి
♦ కడియం దమ్ముంటే ఎమ్మెల్యేగా గెలిచిరా
 
 జనగామ : ‘పాలకుర్తి ఘటనలో తన్నులు తిన్నా.. టీడీపీ కార్యకర్తలను గొడ్డును బాదినట్లు బాదారు. పార్టీ కార్యాలయంలో చొరబడిన పోలీసులు తలలు పగులగొట్టారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లు వేస్తే ఎస్సైకి గాయాలయ్యాయి... కానీ కేసులు మాపై బనాయించారంటూ’ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లపర్యంతమయ్యారు. వరంగల్ జిల్లా జనగామ కోర్టులో బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చిన ఎర్రబెల్లి సోమవారం కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడారు. రాళ్లురువ్విన టీఆర్‌ఎస్ వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్ తెలంగాణలో ప్రతిపక్షాలను లేకుండా చేస్తుందని మండిపడ్డారు.

ప్రభుత్వం, పోలీసులు కలిసి తనపై బనాయించిన అక్రమ కేసులను న్యాయస్థానం తిప్పికొట్టడం వారికి చెంపపెట్టుగా మారిందన్నారు. ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, చిన్నారెడ్డిలపై దాడులు చేయడమే కాకుండా, రేవంత్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారన్నారు. ఆంద్రోళ్లు పాలించిన రోజుల్లో కూడా ఇంత అన్యాయం జరగలేద న్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అడ్డదారిలో మంత్రి పదవి సంపాదించిన కడియం శ్రీహరి దమ్ముంటే ఎమ్మెల్యేగా గెలుపొందాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన పాలకుర్తి సీఐ తిరుపతి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా, కోర్టు వద్ద టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఎర్రబ్లెల్లిని పరామర్శించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగి స్తున్న కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలను ఎండగడతామని ఎల్. రమణ అన్నారు.   

 ఎర్రబెల్లితో పాటు 28 మందిపై కేసు
 పాలకుర్తి టౌన్: పాలకుర్తి ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు టీడీపీకి చెందిన 28 మంది కార్యకర్తలపై పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు