న్యాయం చేయండి: అనూహ్య తండ్రి

25 Jan, 2014 04:05 IST|Sakshi
న్యాయం చేయండి: అనూహ్య తండ్రి

సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: ముంబైలో దారుణహత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసు దర్యాప్తులో మహారాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అనూహ్య తండ్రి ప్రసాద్ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు విజ్ఞప్తి చేశారు. హత్య జరిగి 15 రోజులు దాటిపోయినా నిందితులను గుర్తించలేదని.. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అయితే, ఈ విషయంలో షిండే స్పందన బాధాకరంగా ఉందని అనంతరం మీడియా వద్ద ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
 శుక్రవారం ఉదయం టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, సుజానా చౌదరి కలిసి ప్రసాద్‌ను వెంటపెట్టుకొని షిండేను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రసాద్ తన కూతురు హత్య కేసును నీరుగార్చేందుకు ముంబైకి చెందిన ఒక కార్పొరేటర్ ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆ దృష్ట్యా విచారణను సీబీఐకి అప్పగిస్తే తమకు న్యాయం జరుగుతుందని వేడుకున్నారు. దీనికి షిండే స్పందిస్తూ.. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. అయితే, భేటీ అనంతరం ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ... తమ బాధ చెప్పుకొనేందుకు వెళితే షిండే కేవలం రెండు నిమిషాల సమయమే ఇచ్చారన్నారు. ఈ విషయంలో షిండే స్పందన బాధాకరంగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. అనూహ్య హత్య ఘటనకు సంబంధించి అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ చైర్మన్‌ను కలుస్తామని ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. ఢిల్లీ వెళ్లిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు బందెల థామస్ నోబుల్, అనూహ్య సోదరుడు దీపక్ ఉన్నారు.
 
 వీడని చిక్కుముడులు...
     అనూహ్య వద్ద రెండు ఫోన్లు ఉండగా ఒకటే లభించింది. కానీ, దొరికింది ఏ ఫోన్ అనేది పోలీసులు వెల్లడించడం లేదు.
     ఆమె వద్ద ఉండే ల్యాప్‌ట్యాప్, లగేజీ వివరాలు ఇంకా తెలియలేదు.
     సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌తోపాటు లాప్‌టాప్‌లో నిందితులకు సంబంధించిన వివరాలు ఉండే అవకాశముందని, అవి దొరికితే వారినిగుర్తించేందుకు ఆస్కారముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
     అనూహ్య హత్య కేసుకు సంబంధించి కొన్ని పత్రికల్లో తొమ్మిదో తేదీన సెల్‌ఫోన్‌ను ఎవరో ఆన్ చేశారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని అనూహ్య మేనమామ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
 
 వెంటనే చర్యలు చేపట్టండి: షిండే
 అనూహ్య దారుణ హత్య ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని.. నిందితులను వెంటనే పట్టుకోవాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్‌కు ఒక లేఖ రాశారు. ‘‘అనూహ్య హత్య ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి నన్ను కలిసి వేడుకున్నారు. ఈ విషయంలో వెంటనే చర్యలు చేపడతారని, ఆ దారుణానికి ఒడిగట్టినవారిని అరెస్టు చేస్తారని ఆశిస్తున్నాను’’ అని అందులో షిండే పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు