ఆరునెలల లోపే ట్విట్టర్కు అధికారి గుడ్ బై

2 Aug, 2016 13:37 IST|Sakshi
ఆరునెలల లోపే ట్విట్టర్కు అధికారి గుడ్ బై

యాపిల్ పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసి, మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్లో కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్గా చేరిన నటాలీ కెరిస్ తన పదవికి గుడ్ బై చెప్పనున్నారు. కెరిస్ కంపెనీ నుంచి నిష్క్రమించబోతున్నట్టు ట్విట్టర్ ధృవీకరించింది.  అయితే గత ఆరు నెలల క్రితమే కెరిస్ ఈ బాధ్యతలు చేపట్టారు. జాయిన్ అయిన ఆరునెలల లోపే తన పదవిని వీడటం ప్రస్తుతం గమనార్హంగా మారింది. ట్విట్టర్ స్టోరీని ప్రపంచానికి షేరు చేయడంలో తన వంతు కృషిచేసినందుకు నటాలీ కెరిస్కు ట్విట్టర్ అభినందనలు తెలిపింది.  తన పదవీ కాలంలో కమ్యూనికేషన్ ఆఫీసర్గా కీలక పాత్ర పోషించినట్టు పేర్కొంది. తక్కువ సమయంలోనే ఎంతో ఉత్సాహంతో పనిచేశారని, ఆమె భవిష్యత్లో మరింత ఉన్నతమైన వ్యక్తిగా వెలుగొందాలని ఆశిస్తున్నట్టు శుభాకాంక్షలు తెలిపింది.  

14ఏళ్లపాటు టెక్ దిగ్గజం యాపిల్లో పనిచేసిన నటాలీ కెరిస్ గత ఫిబ్రవరిలోనే ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. ఎంతో కీలకమైన సమయంలో యాపిల్కు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించారని టెక్ వెబ్సైట్ 9టూ5 మ్యాక్ రిపోర్టు పేర్కొంది. నటాలీ కెరిస్ రాజీనామాతో ప్రస్తుత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్, ట్విట్టర్ కమ్యూనికేషన్ వైస్ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ట్విట్టర్ సీఈవోగా జాక్ దోర్సీ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటనుంచీ కంపెనీకి చెందిన పలువురు సీనియర్ అధికారులు గుడ్ బై చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నిలిచిపోయిన యూజర్ వృద్దిని పెంచుకోవడానికి కొత్త మార్గాల అన్వేషణలో ప్రస్తుతం ట్విట్టర్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఎలాగైనా రెవెన్యూలను పెంచుకోవాలని తాపత్రయ పడుతోంది.

మరిన్ని వార్తలు