మన్మోహన్ సింగ్ బెదిరించారు: బైజాల్

26 May, 2015 12:25 IST|Sakshi
మన్మోహన్ సింగ్ బెదిరించారు: బైజాల్

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మరో మాజీ ఉన్నతాధికారి విరుచుకుపడ్డారు. 2జీ వ్యవహారంలో సహకరించకుంటే 'హాని' తప్పదని ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ హెచ్చరించారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్ ఆరోపించారు. యూపీఏ -2 ప్రభుత్వం తన ప్రతిష్టను దిగజార్చిందని వాపోయారు.

2జీ స్కామ్ లో విచారణ ఎదుర్కొంటున్న బైజాల్ 'ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫామ్స్: 2జీ, పవర్ అండ్ ప్రైవేట్ ఎంటర్ ప్రైజ్- ఏ ప్రాక్టీషనర్స్ డైరీ' పేరుతో రాసిన పుస్తకంలో పలు విషయాలు వెల్లడించారు. తన లాంటి అధికారులు విచారణ ఎదుర్కొవడానికి ప్రధాన కారకుడు మన్మోహన్ సింగ్ అని ఆరోపించారు.

టెలికాం మంత్రిగా దయానిధి మారన్ నియమకాన్ని తాను వ్యతిరేకించానని బైజాల్ తెలిపారు. తన ఆందోళనను మన్మోహన్ సింగ్ పట్టించుకోలేదన్నారు. టెలికాం విభాగానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాని, టెలికాం మంత్రి తీసుకుంటారని... వాటిని పాటించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని మారన్ తనను బెదిరించారని వెల్లడించారు. మారన్ అన్నట్టుగానే చేశారని, తర్వాత తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. 2009-10లో 2జీ స్కామ్ వెలుగులోకి వచ్చాక ట్రాయ్ లోని కీలక ఫైళ్లను యూపీఏ ప్రభుత్వం తొలగించిందని బైజాల్ తన పుస్తకంలో ఆరోపించారు.

మరిన్ని వార్తలు