స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌!

16 Jul, 2017 03:24 IST|Sakshi
స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌!

- డ్రగ్స్‌ కేసులో చర్యలకు రెడీ అవుతున్న ఎక్సైజ్‌ అధికారులు
- పక్కా ఆధారాలు సేకరించిన సిట్‌.. కెల్విన్‌ విచారణలో విస్తుగొలిపే నిజాలు
- వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్ల ద్వారా కోడ్‌ భాషలో ఆర్డర్లు
- తెరపైకి మరికొందరు ప్రముఖులు
- గోవా నుంచి రోడ్డు మార్గంలో డ్రగ్స్‌ రవాణా
- గత రెండేళ్లుగా జర్మనీ, నెదర్లాండ్స్‌ నుంచి కొరియర్‌ ద్వారా సరఫరా
- వేరే ముఠాతో వ్యాపారం విస్తరించిన కెల్విన్‌


సాక్షి, హైదరాబాద్‌

మేనేజర్‌: టూ పేపర్స్‌ ప్లీజ్‌
కెల్విన్‌: కలెక్ట్‌ ఫ్రం బోయ్‌
మేనేజర్‌: వేర్‌?
కెల్విన్‌: ఔటర్‌

ఇది సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖుడి వద్ద పనిచేసే మేనేజర్‌కు, కెల్విన్‌కు మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌! ఇందులో ‘పేపర్‌’ అంటే డ్రగ్‌. ‘బోయ్‌’ అంటే డ్రగ్స్‌ తెచ్చి ఇచ్చే కొరియర్‌. సినీ రంగంలో ఇన్నాళ్లూ ఇలా గుట్టుగా సాగిన వ్యవహారం అంతా క్రమంగా వెలుగుచూస్తోంది. కెల్విన్‌ విచారణలో అలాంటి ‘పేపర్లు’, మేనేజర్లు, వారి వెనకాల ఉన్న పెద్దలు ఒక్కరొక్కరుగా బయట కొస్తున్నారు!! ప్రముఖుడితో పాటు ఓ హీరో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. త్వరలో వారిద్దరినీ అరెస్టు చేసేందుకు సిట్‌ రంగం సిద్ధం చేస్తోంది. అందుకు కావాల్సిన ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

వీళ్లు డ్రగ్స్‌ తీసుకోవటమే కాకుండా.. సరఫరా చేసినట్లు కూడా అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. వీలైతే విచారణ కంటే ముందే వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. డ్రగ్స్‌ వ్యాపారి కెల్విన్‌ మరోసారి ప్రముఖ దర్శకుడు, ప్రముఖ నటి పేర్లను బయట పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. శనివారం బాలానగర్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో సిట్‌ బృందం విచారణలో కెల్విన్‌ ఈ విషయాలన్నింటినీ పూసగుచ్చినట్లు సమాచారం. కెల్విన్‌ను విచారణ కోసం తమకు అప్పగించాలని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. రెండ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఎక్సైజ్‌ అధికారులు చర్లపల్లి జైలులో ఉన్న అతడిని శనివారం తమ అధీనంలోకి తీసుకున్నారు. కెల్విన్‌తోపాటు మరో డ్రగ్స్‌ గ్యాంగ్‌ నేతలు ఖుద్దూస్, వాహిద్‌లను విచారించారు. కెల్విన్‌ అరెస్టు సమయంలోనే అధికారులు అతడి ముఠా ఫోన్‌ వివరాలు,  వాట్సాప్‌ మేసేజ్‌లను సేకరించారు. ఎప్పుడు, ఎక్కడ కలుసుకునేవారు.. డ్రగ్స్‌ ఎవరి ద్వారా చేరవేసేవారు.. తదితర వివరాలన్నీ పక్కాగా సేకరించారు. ఆ తర్వాతే 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు.

ఆరు నెలల్లో 185 సార్లు ఫోన్‌..
అధికారులు అనుమానించినట్టుగానే.. మరో డ్రగ్‌ ముఠాకు చెందిన బ్రెండెన్, నిఖిల్‌శెట్టిలతో తనకు సంబంధం ఉన్నట్లు కెల్విన్‌ బయటపెట్టినట్టు తెలిసింది. నాలుగేళ్ల క్రితం బ్రెండెన్‌ తనను సినీ వర్గాలకు తొలిసారి పరిచయం చేశాడని, అప్పట్నుంచే దర్శకులు, నటులకు దగ్గరైనట్లు అతడు వివరించాడు. ప్రముఖ దర్శకుడి ద్వారానే సినీ ఇండస్ట్రీలో ఇతర దర్శకులు, నిర్మాతలు, హీరోలను కలుసుకున్నట్లు కెల్విన్‌ వెల్లడించాడు. దర్శకుడితోపాటు అతడితో సన్నిహితంగా ఉండే నటికి పలుమార్లు డ్రగ్స్‌ అందించినట్టు వివరించాడు. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి కూడా ఆ దర్శకుడి ద్వారానే ఎల్‌ఎస్‌డీ ఇచ్చినట్లు కెల్విన్‌ చెప్పినట్లు తెలిసింది. ఆ దర్శకుడు, ఆయన కారు డ్రైవర్, మేనేజర్‌లతో ఆరునెలల కాలంలో దాదాపు 185 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పాడు. ఆయన వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా డ్రగ్స్‌ ఆర్డర్‌ చేసే వారని, ఎంత కావాలో కోడ్‌ రూపంలో చెప్పేవారని కెల్విన్‌ వివరించినట్టు తెలిసింది. కెల్విన్‌ ఫోన్‌లో సీక్రెట్‌ ఫోల్డర్‌ను కూడా అధికారులు డీకోడ్‌ చేశారు. మూడు సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

నేరుగా కలిసేవాడిని కాదు..
ప్రతీసారి తాను సినీ ప్రముఖులతో కలిసే వాడిని కాదని, తప్పని పరిస్థితులు ఉంటేనే వారిని కలిసే వాడినని కెల్విన్‌ చెప్పినట్లు తెలిసింది. ‘‘డ్రగ్స్‌ కావాలని వాట్సాప్, ఒక్కొక్కసారి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారు. నా మనుషుల ద్వారా వారు చెప్పిన కోడ్‌ ప్రకారం చేరవేసేవాడిని. గోవా నుంచి రోడ్‌ మార్గంలో డ్రగ్‌ వచ్చేది. గడచిన రెండేళ్ల నుంచి జర్మనీ, నెదర్లాండ్స్‌ నుంచి కొరియర్‌ ద్వారా తెప్పించి సరఫరా చేశా..’’ అని కెల్విన్‌ సిట్‌ విచారణలో చెప్పినట్లు సమాచారం. బ్రెండెన్, నిఖిల్‌శెట్టి ద్వారా తన వ్యాపారం విస్తరించినట్లు, తన దగ్గర డ్రగ్స్‌ లేకుంటే వారి దగ్గర్నుంచి ఇప్పించేవాడినని చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్‌ తీసుకున్నవారు క్రెడిట్‌ కార్డు ద్వారా తన ఖాతాకు డబ్బు మళ్లించేవారని వెల్లడించాడు. ఓ నటుడికి తానే డ్రగ్స్‌ అలవాటు చేశానని ఈ సందర్భంగా కెల్విన్‌ చెప్పినట్లు తెలిసింది. కొన్ని ప్రముఖ విద్యాలయాల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేశామని, వారి ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికే తప్ప ఇందులో ఎలాంటి ఉగ్రవాద కుట్ర కోణం లేదని అతడు చెప్పినట్లు సమాచారం. ఖుద్దూస్, వాహిద్‌లను విచారించినా వారి నుంచి ఆశించిన స్థాయిలో సమాచారం రాలేదని తెలిసింది. వారి విచారణ అంతా రంగారెడ్డి జిల్లా నాగోల్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థుల చుట్టే తిరిగినట్లు సమాచారం.

వారూ నా కస్టమర్లే..
సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన నిర్మాత కొడుకుతోపాటు మరో ప్రముఖ నిర్మాత చిన్న కొడుక్కి ఎల్‌ఎస్‌డీ ఇచ్చామని, వారిద్దరూ తన వద్ద రెగ్యులర్‌గా డ్రగ్స్‌ తీసుకునేవారని కెల్విన్‌ తెలిపాడు. ఓ నిర్మాత కొడుకు ఆరు మాసాల కిందటే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని, అయితే దాన్నుంచి ఇటీవలే బయటకొచ్చాడని వెల్లడించాడు. మరో నిర్మాత తనయుడు ఇప్పటికీ తన ఖాతాదారుడేనని చెప్పాడు. అతడిని దాదాపు 25 రోజులపాటు డ్రగ్‌ ఎడిక్షన్‌ కేంద్రానికి పంపి మాన్పించే ప్రయత్నం చేశారని వివరించాడు. సదరు నిర్మాత కొడుకు కెల్విన్‌తో ఫోన్‌ సంభాషణ చేసినట్లు సిట్‌ ఆధారాలు సేకరించింది. కానీ ఇది నేరం రుజువు చేసేందుకు సరిపోదు కాబట్టి ఆయనకు నోటీస్‌ ఇవ్వాలని భావిస్తోంది. ప్రముఖ దర్శకుడి దాదాపు 17 సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన ఓ టెక్నీషియన్‌కు కూడా డ్రగ్స్‌ తీసుకున్నాడని కెల్విన్‌ చెప్పినట్లు తెలిసింది. ఈవెంట్‌ మేనేజర్లే ఎక్కువగా డ్రగ్స్‌ అందుకునే వారని చెప్పినట్లు సమాచారం.

పెద్దనోట్ల రద్దుతో ‘డిజిటల్‌’ వైపు..
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సినీ ప్రముఖులు అంతా డిజిటల్‌ మనీ లావాదేవీలతోనే డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. దీంతో అధికారులు కెల్విన్, అనిల్‌శెట్టితోపాటు వారి ముఠా సభ్యుడు జీషన్‌ బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించారు. వారికి ఏయే బ్రాంచీల్లో  ఖాతాలు ఉన్నాయో విచారణ చేస్తున్నారు. ఏడాది కాలంపాటు ఆయా ఖాతాల ద్వారా నడిచిన లావాదేవీల స్టేట్‌మెంట్ల కోసం బ్యాంకు అధికారులు లేఖలు రాస్తున్నారు.

తిరిగి విధుల్లోకి అకున్‌
డ్రగ్స్‌ కేసు దర్యాప్తు నేపథ్యంలో ఎక్సైజ్‌ డీజీ అకున్‌ సబర్వాల్‌ సెలవులు రద్దు చేసుకున్నారు. దర్యాప్తు పూర్తి అయ్యేవరకూ సెలవులు వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే అకున్‌ సబర్వాల్‌ ఈ నెల 16 నుంచి 27 వరకు సెలవులపై వెళ్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని అకున్‌ వివరించారు. కేసు తీవ్రత దృష్ట్యా సెలవులు రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.

గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్‌
అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ధూల్‌పేట ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ధూల్‌పేటకు చెందిన సునీల్‌ సింగ్‌ (24) అనే వ్యక్తి గోనె సంచిలో  చింతపండు చాటున గంజాయి పెట్టి విక్రయిస్తుండగా ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 42 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తూ ఇలా మూడోసారి దొరకటంతో అతడిపై పీడీ చట్టం పెట్టినట్లు వివరించారు.