ఆ వరుడిని ఉరి తీశారు..

29 Apr, 2015 10:31 IST|Sakshi
ఆ వరుడిని ఉరి తీశారు..

సిలాక్యాప్: ఆ వరుడు చనిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు, వధువు తరపు బంధువులు చేసిన విజ్ఞాపనలను ఇండోనేషియా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆస్ట్రేలియా కూడా ఏదైనా చేద్దామనే లోపే జరగాల్సినది జరిగిపోయింది. స్మగ్లర్గా, ఖైదీగా, ప్రేమికుడిగా, నవ వరుడిగా మారిన ఆండ్రూ చాన్ చివరికి పెళ్లి దుస్తులు కూడా మారకముందే ఇండోనేషియా ప్రభుత్వం చేతిలో ఉరి తీయబడ్డాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూచాన్తో సహా మొత్తం ఏడుగురు స్మగ్లర్లను ఇండోనేషియా ప్రభుత్వం బుధవారం తెల్లవారుజామున ఉరితీసింది. వీరిలో ఇద్దరు ఆస్ట్రేలియన్లు ఉన్నారు.

కాగా, ఆండ్రూచాన్ది మాత్రం ఓ తీరని విషాదం. ఆస్ట్రేలియాకు  చెందిన  ఆండ్రూ చాన్ డ్రగ్ స్మగ్లింగ్ కేసులో జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఇతడితో సహా మొత్తం తొమ్మిదిమంది 8.2 కేజీల హెరాయన్, 3.1 మిలియన్ల డాలర్ల నగదును ఇండోనేషియాకు అక్రమంగా రవాణా చేస్తూ 2005లో అరెస్టయ్యారు. నేరం రుజువు కావడంతో ఆండ్రూకు మరణ శిక్ష ఖరారయ్యింది. ఈ కేసునే బాలి నైన్ డ్రగ్ కేసుగా పిలుస్తారు. అంతకుముందే ఫ్యాబియంతి హెరెవిల్లా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ఆండ్రూచాన్ తన చివరి కోరికగా ఆమెను జైలులోనే సోమవారం పెళ్లి చేసుకున్నాడు.

 

ఉరిశిక్ష సమీపిస్తుండటంతో అతడి తరుపున, ఆమె తరుపునవారంతా అటు ఇండోనేషియా ప్రభుత్వానికి, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కన్నీటిపర్యంతమవుతూ ఆండ్రూకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా వేడుకున్నారు. దీనిపై ఆస్ట్రేలియా అధికారులు ఇండోనేషియా అధికారులను సంప్రదించే ఆలోచనలు చేస్తుండగానే బుధవారం వారిని ఉరితీసినట్లు ప్రకటించారు. ఆండ్రూచాన్, హెరెవిల్లాల ప్రేమ పెళ్లి ఓ విషాదంగా మిగిలిపోయింది. నవ వధువు హెరెవిల్లాకు మింగుడు పడని వార్తగా మిగిలింది. ఇక ఉరి తీయబడిన మిగితావారిలో ఇంకొకరు ఆస్ట్రేలియా వ్యక్తికాగా, నలుగురు ఆఫ్రికా, ఒకరు బ్రెజిల్కు చెందినవారు.


తమ రాయబారిని వెనక్కి పిలిచిన ఆస్ట్రేలియా
తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులు ఆండ్రూచాన్, మిరాన్ సుకుమారన్ లను ఇండోనేషియా ప్రభుత్వం ఉరి తీసిన కారణంగా ఆదేశంలోని తమ విదేశాంగ రాయబారి జులీ బిషప్ను వెనుకకు వచ్చేయాల్సిందిగా ప్రధాని టోని అబాట్ బుధవారం ఆదేశించారు. ఇండోనేషియా సార్వభౌమత్వాన్ని తాము గౌరవిస్తామని, ఆ దేశంతో సంబంధాలు తమకు ముఖ్యమైనవేనని అయితే, కొన్ని గంటల క్రితం జరిగిన ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని ఆయన ప్రకటన చేశారు. మరోపక్క, ఇండోనేషియా చర్యను ఫ్రాన్స్ ఖండించింది.

మరిన్ని వార్తలు