ఎన్నికల పండితులు ఇప్పుడేమంటారు?

12 Mar, 2017 02:42 IST|Sakshi
ఎన్నికల పండితులు ఇప్పుడేమంటారు?

న్యూఢిల్లీ: ఎప్పుడు ఎన్నికలు జరిగినా రంగంలోకి దిగే విశ్లేషకులు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మూడొందల పైన సీట్లు సాధిస్తుందని అంచనా వేయలేకపోయారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో టైమ్స్‌నౌ–వీఎం ఆర్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌లో బీజేపీకి 190–210సీట్లు వస్తాయని అంచనా వేయగా, ఇండియా న్యూస్‌–ఎంఆర్సీ 185 సీట్లు, ఏబీపీ–లోక్‌నీతి164–176 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. అయితే ఎన్నికల్లో మాత్రం 403 స్థానాలకు 320 పైచీలుకు సీట్లను కమలం పార్టీ గెలుచుకుని విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. పంజాబ్‌లో కాంగ్రెస్, అకాలీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతుందన్న అంచనాలు తప్పాయి.

 ఇండియాటుడే–యాక్సిస్‌ కాంగ్రెస్‌ 62–71 స్థానాల్లో గెలుపొందుతుందని, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కు 42–51 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టీవీ–సీఓటర్‌ సంస్థలు ఆప్‌కు 59–67, కాంగ్రెస్‌కు 41–49  సీట్లు వస్తాయని వెల్లడించింది. కానీ కాంగ్రెస్‌ పంజాబ్‌లో 70 పైచీలుకు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రం విశ్లేషకుల అంచనాలు నిజమయ్యాయి. ఇండియాటుడే, న్యూస్‌24 చానెళ్లు బీజేపీ 46–53, 53 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. అందుకు అనుగుణంగానే మొత్తం 70 స్థానాల్లో 57 చోట్ల బీజేపీ జయకేతనం ఎగురవేసింది.

మరిన్ని వార్తలు