ఆ సర్వేలు తప్పు.. మాకు 300 ఖాయం

11 Mar, 2017 07:50 IST|Sakshi
ఆ సర్వేలు తప్పు.. మాకు 300 ఖాయం

ఉత్తరప్రదేశ్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచాలన్నీ తప్పని, తమకు 300 స్థానాలు ఖాయమని యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కొన్ని గంటల ముందు ఆయనీ మాట చెప్పారు. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న యూపీలో అధికారం చేపట్టాలంటే కనీసం 202 స్థానాలు అవసరం. అయితే ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్న జనాదరణను బట్టి 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గాను 71 బీజేపీకే వచ్చాయన్న విషయాన్ని మౌర్య గుర్తు చేశారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదని.. ఇప్పుడు జరిగిన ఎన్నికలతో పాటు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం ఖాయమని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కావాలంటే తన అత్తయ్య (మాయావతి)తోను, స్నేహితుడు (రాహుల్)తోను జత కట్టవచ్చని.. కానీ బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలను కూకటివేళ్లతో పెకలించేలా మెజారిటీలు సాధిస్తుందని మౌర్య చెప్పారు. ఫలితాల కోసం గతంలోలా రోజంతా ఎదురు చూడాల్సిన అసవరం ఉండబోదని.. ఉదయం 11 గంటల కల్లా పరిస్థితి మొత్తం స్పష్టం అవుతుందని ఆయన చెప్పారు.