ఎగుమతులకు ప్రోత్సాహం

1 Aug, 2013 02:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్రం బుధవారం కీలక చర్యలు తీసుకుంది. కొన్ని ఎగుమతులపై వడ్డీ సబ్బిడీని ప్రస్తుత 2 శాతం నుంచి 3 శాతానికి పెంచింది. దీనితోపాటు ఆర్థిక సహాయానికి సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్ల పరిష్కారానికీ హామీ ఇచ్చింది. తాజా ప్రోత్సాహక చర్యల వల్ల కేంద్రంపై దాదాపు రూ.2,000 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థికమంత్రి పి. చిదంబరం ఇక్కడ విలేకరులకు తెలిపారు. అంతర్జాతీయ మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే ఎగుమతులు తగ్గుతున్నందువల్ల పెరుగుతున్న వాణిజ్యలోటు వంటి సవాళ్లపై కేంద్రం దృష్టి పెట్టినట్లు చిదంబరం తెలిపారు. అంతక్రితం వాణిజ్యశాఖ మంత్రి ఆనంద్ శర్మ మాట్లాడుతూ, వడ్డీ సబ్సిడీ పెంపు గురువారం నుంచీ అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రయోజనం పొందుతున్న రంగాలకు కాకుండా మరికొన్ని రంగాలకు ఈ ప్రయోజనాన్ని విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. ఎగుమతుల పెంపునకు ఆగస్టు 27న బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు