ఎగుమతులు 24% డౌన్

16 Oct, 2015 00:28 IST|Sakshi
ఎగుమతులు 24% డౌన్

సెప్టెంబర్‌లోనూ మైనస్...
ఈ ధోరణి వరుసగా 10వ నెల
దిగుమతులూ 25 శాతం క్షీణత..
వాణిజ్యలోటు 10 బిలియన్ డాలర్లుగా నమోదు...

 
న్యూఢిల్లీ: భారత ఎగుమతుల రంగానికి కష్టాలు తొలగిపోలేదు. 2014 సెప్టెంబర్ ఎగుమతులతో పోల్చితే 2015 సెప్టెంబర్‌లో ఎగుమతులు అసలు పెరక్కపోగా 24 శాతం పడిపోయాయి. విలువ రూపంలో ఎగుమతుల విలువ 22 బిలియన్ డాలర్లు. 2014 సెప్టెంబర్‌లో 29 బిలియన్ డాలర్లు. ఇలాంటి క్షీణ ధోరణి గడచిన 10 నెలలుగా నెలకొంది. పెట్రోలియం ప్రోడక్టులు, ముడి ఇనుము, ఇంజనీరింగ్ వస్తువులు వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులపై ‘అంతర్జాతీయ మాంద్యం’ ప్రభావం పడుతుండడం... ఈ రంగంలో ప్రతికూలతకు కారణం.  ఇది ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇక దిగుమతులూ 25 శాతం క్షీణించాయి. విలువ 43 బిలియన్ డాలర్ల నుంచి 32 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎగుమతుల- దిగుమతుల వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు సెప్టెంబర్లో 10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.  వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.

 తొలి ఆరు నెలల్లో చూస్తే...
 కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) మొదటి ఆరు నెలలనూ చూస్తే (ఏప్రిల్-సెప్టెంబర్) ఎగుమతులు 18 శాతం క్షీణించి... 161 బిలియన్ డాలర్ల నుంచి 133 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు సైతం 15 శాతం తగ్గుదలతో 235 బిలియన్ డాలర్ల నుంచి 201 బిలియన్ డాలర్లకు క్షీణించింది. దీంతో ఈ వ్యవధికిగాను వాణిజ్యలోటు 74 బిలియన్ డాలర్ల నుంచి 68 బిలియన్ డాలర్లకు తగ్గింది.

46 శాతం పడిన బంగారం దిగుమతులు
కాగా సెప్టెంబర్‌లో బంగారం దిగుమతులు 46 శాతం తగ్గాయి. ఈ విలువ 3.78 బిలియన్ డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
 
 లక్ష్యం కష్టమే!
 గతేడాది (2014-15) దేశ ఎగుమతుల విలువ 310.5 బిలియన్ డాలర్లు. ఎగుమతుల విలువ 447.5 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 137 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది 325 బిలి యన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. అయితే తాజా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యం నెరవేరకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
 
 ఆదుకోవాలి: ఎఫ్‌ఐఈఓ

 ఎగుమతుల క్షీణ ధోరణి పట్ల భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) ప్రెసిడెంట్ ఎస్‌సీ రెల్హాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగుమతిదారులను ఆదుకునేం దుకు వడ్డీ సబ్‌వెన్షన్ (వడ్డీ రాయితీ) పథకం కొనసాగింపు వంటి చొరవలను తక్షణం అమలు చేయాలని కోరారు.
 
 

మరిన్ని వార్తలు