అమెరికా వెన్నులో వణుకు

8 Jan, 2014 02:14 IST|Sakshi
ఇండియానాపోలిస్ విమానాశ్రయంలోని కార్లపై భారీగా కురిసిన మంచు

ఇండియానాపోలిస్ విమానాశ్రయంలోని కార్లపై భారీగా కురిసిన మంచు
 ఇండియానా పోలిస్ (అమెరికా): ధ్రువ ప్రాంతాల నుంచి వీస్తున్న భీకరమైన చల్లగాలులతో దక్షిణ, తూర్పు అమెరికా, తూర్పు కెనడా ప్రాంతాలు వణుకుతున్నాయి. మధ్య పశ్చిమ ప్రాంతం నుంచి విస్తరించిన ఈ చలిగాలులతో గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. షికాగోలో ప్రస్తుతం రికార్డు స్థాయిలో మైనస్ 27, ఫోర్ట్‌వేన్, ఇండియానా ప్రాంతాల్లో మైనస్ 25 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి ఓక్లహామా, టెక్సాస్‌లలో కూడా ఉంది. ఎముకలు కొరికే చల్లగాలుల దెబ్బకు స్కూళ్లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి.
 
 ధ్రువ ప్రాంత సుడిగాలులు అలబామా, జార్జియా ప్రాంతాలకూ విస్తరించాయని, దేశమంతా కూడా విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు చెప్పారు. భీకరంగా వీస్తున్న చల్లగాలులకు తోడు ఇండియానా ప్రాంతంలో 30 సెంటీమీటర్ల హిమపాతం కూడా నమోదైంది. దీంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. చలి నిజంగా చంపేస్తోందని, సరైన దుస్తులు లేకుండా బయటికి వస్తే పది నిమిషాల్లో చచ్చిపోవడం ఖాయమని ఇండియానా పోలిస్ మేయర్ గ్రెగ్ బల్లార్డ్ చెప్పారు. భారీ హిమపాతంతో విద్యుత్ ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. విద్యుత్‌ను పరిమితంగా వాడుకోవాలంటూ పంపిణీ సంస్థలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరికొంత కాలం చీకట్లు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
 
 మంచు తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, కెనడాలో భారత సంతతి జనాభా సుమారు 18లక్షలకు పైగానే ఉంది. భారతీయు లు అధికంగా నివసించే న్యూజెర్సీలో ఉష్ణోగ్రతలు మైనస్ 14కు పడిపోయాయి. అమెరికాలో మొత్తంగా 2,500 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
 

మరిన్ని వార్తలు