ఇంటిపేరుతో కాదు నా పేరుతోనే సమస్యట!

3 Jul, 2016 12:26 IST|Sakshi
ఇంటిపేరుతో కాదు నా పేరుతోనే సమస్యట!

ఐఎస్‌ఐఎస్‌ లేదా ఐసిస్‌ అంటే ఇప్పుడు ప్రపంచం వణికిపోతోంది. ఇరాక్‌, సిరియాలలో ఎదిగిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు ‘ఐసిస్‌’ సంక్షిప్తనామంగా మారిపోవడం.. ఆ పేరు కలిగిన అనేకమందిని ఇరకాటంలో పడేసింది. నిజానికి ఐసిస్‌ అంటే ఈజిప్టు దేవత పేరు. ఆరోగ్యం, పెళ్లి, జ్ఞానమని ఈ పేరుకు అర్థం. ఈ పేరు పెట్టుకున్నందుకే ఓ మహిళకు తాజాగా ఫేస్‌బుక్‌ (ఎఫ్‌బీ) షాకిచ్చింది. తమ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో కొనసాగాలంటే పేరు మార్చుకోవాలని, లేదా.. తన పేరు నిజమైనదేనని ఆధారాలు చూపాలని ఎఫ్‌బీ డిమాండ్ చేసింది.

బ్రిటన్‌లోని బ్రిస్టల్‌కు చెందిన ఐసిస్‌ థామస్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. పేరు మార్చుకోవాలని గత నెల 27న ఫేస్‌బుక్‌ ఆమెను అడిగింది. ఆమె మొదట తన పేరును ఐసిస్‌ వర్సెస్టర్‌ అని ఫేస్‌బుక్‌లో నమోదుచేసుకుంది. తన ఇంటి పేరు పెడితే అప్పుడు పనిచేసే కంపెనీ నుంచి ఇబ్బందులు వస్తాయేమోననే ఉద్దేశంతో పేరు మార్చింది. తాజాగా ఫేస్‌బుక్‌ కోరడంతో ఆమె తన అసలైన ఇంటిపేరుతో ప్రొఫైల్ నేమ్‌ను ఐసిస్ థామస్‌గా మార్చింది. కానీ ఫేస్‌బుక్‌ మాత్రం సమస్య మీ ఇంటిపేరుతో కాదు మీ అసలు పేరైన ఐసిస్‌తోనేనని తేల్చిపారేసింది.

ఐసిస్‌ పేరును ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని, తమ పాలసీ ఇందుకు ఒప్పుకోదని ఆమెకు మెసెజ్ పంపింది. ఈ నేపథ్యంలో తన పేరు గురించి ఫేస్‌బుక్‌ కు ఆధారాలు కూడా పంపానని, అయినా అది సంతృప్తి చెందుతుందా అన్నది మాత్రం డౌటేనని ఆమె పేర్కొంది. తమ వెబ్‌సైట్‌లో ఇస్లామిక్ స్టేట్‌ మూలాలుకానీ, అనుకూల గ్రూపులుకానీ ఉండకూడదన్న ఉద్దేశంతో ఫేస్‌బుక్‌ ఈ పేరును ఎంతమాత్రం అనుమతించడం లేదు. నిజానికి ఐసిస్‌ పేరు వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది అమాయకులు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ అయిన ఐసిస్‌ ఫార్మాస్యూటికల్‌ 2015 డిసెంబర్‌లో తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది. 35 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ అమెరికా పుస్తక దుకాణానికి ఐసిస్‌ పేరు ఉండటంతో దానిపై దాడి జరిగింది.
 

>
మరిన్ని వార్తలు