‘ఫేస్‌బుక్’లో ఫోన్ నెంబరిస్తే..!

12 Aug, 2015 08:52 IST|Sakshi
‘ఫేస్‌బుక్’లో ఫోన్ నెంబరిస్తే..!

లండన్: ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’ యూజర్స్ తమ ప్రొఫైల్‌లో ఫోన్ నెంబర్ ఫీడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. యూజర్స్, పిక్చర్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయమంటూ ఫేస్‌బుక్ యాజమాన్యమే యూజర్స్‌ను ఇటీవల ప్రోత్సహిస్తోంది. అలా చేసినట్లయితే ఏ యూజర్ తన ప్రైవసీ సెట్టింగ్స్‌ను పెట్టుకున్నా అతని ఫోన్ నెంబర్ ద్వారా ఆ యూజర్ పేరును, పిక్చర్‌ను, లొకేషన్‌ను, ఇతరత్రా సమాచారాన్ని ఇట్టే దొంగలించవచ్చని, అతని ఫేస్‌బుక్ ఖాతాలోకి వెళ్లి కామెంట్స్ కూడా చేయవచ్చని బ్రిటన్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిరూపించారు.

ఫేస్‌బుక్ ఓపెనింగ్ టైపింగ్ బార్‌పై ఎవరి ఫోన్ నెంబర్‌ను టైప్ చేసినా వారికి సంబంధించిన ప్రొఫైల్, ఫొటో, లొకేషన్, ఇతరత్రా వివరాలు తెలుసుకోవచ్చని బ్రిటన్‌కు చెందిన సాల్ట్ డాట్ ఏజెన్సీ టెక్నికల్ డెరైక్టర్ రెజా మొయావుద్దీన్ తన బ్లాగ్‌లో తెలియజేశారు. తాను బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన ప్రాబబుల్ నెంబర్లను ర్యాండమ్‌గా కొన్ని లక్షల్లో ఫేస్‌బుక్ యాప్ బిల్డింగ్ ప్రోగ్రామ్ (ఏపీఐ)కు పంపించానని, ఆ ఫోన్ నెంబర్లను ట్యాలీ అయిన ప్రతి యూజర్ ప్రొఫైల్, ఇతరత్రా వివరాలు తనకు అందాయని ఆయన తెలిపారు.

తానీ విషయాన్ని స్వయంగా ‘ఫేస్‌బుక్’ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లానని, అయితే వారిచ్చిన సమాధానం సంతృప్తిగా లేదని ఆయన పేర్కొన్నారు. ప్రొఫైల్స్ వెల్లడైనా, వారి పర్సనల్ సెట్టింగ్స్‌లోకి అంత సులభంగా వెళ్లలేమని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి తెలిపారట. అయినా ఎవరి పట్ల అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయకుండా, యూజర్ ఖాతాను దుర్వినియోగం చేయకుండా తమ ఏపీఐ టీమ్ ఎల్లప్పుడూ ఓ కంట నిఘా వేసి ఉంటుందని చెప్పారట. పూర్తి వ్యక్తిగత వ్యాఖ్యలు షేర్ చేసుకోవాలనుకునే వారు ఫోన్ నెంబర్ ఇవ్వక పోవడమే మంచిదని కూడా ఆయన సలహా ఇచ్చారట.
 
సైబర్ క్రిమినల్స్ పెరిగి పోయిన నేటి సాంకేతిక యుగంలో ఫోన్ నెంబర్ ద్వారా ఇతరుల వ్యక్తిగత వివరాలు తెలుసుకునే వీలుండడం ప్రమాదకరమని మొయావుద్దీన్ హెచ్చరిస్తున్నారు. ఆపిల్ కంపెనీలాగా ఉత్పత్తుల నిర్మాణంపై కాకుండా ఒకరి నుంచి ఒకరు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడినందున ఫేస్‌బుక్‌లో ప్రైవసి తక్కువని న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జస్టిన్ కప్పోస్ తెలిపారు. 26లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు