లండన్: సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ 'ఆన్ దిస్ డే' పేరిట పాత అనుభవాలు, జ్ఞాపకాలను తన యూజర్లకు గుర్తుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా ప్రస్తుత రోజుకు సంబంధించి గతంలో జరిగిన ఘటనలు, అప్పటి ఫొటోలు, పోస్టులను అది మరోసారి యూజర్‌కు గుర్తుచేస్తున్నది. అందులో ఆనందకరమైన అనుభూతులు యూజర్లను ఆకట్టుకుంటుండగా.. ఆ రోజుకు సంబంధించి గతంలో జరిగిన బాధాకరమైన జ్ఞాపకాలు వారిని నొప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తుచేయకుండా ఉండేవిధంగా ఫేస్బుక్ సరికొత్తగా ఫిల్టర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.
ఫేస్బుక్లో ఫలానా తేదీలను, వ్యక్తులను గుర్తుచేయకుండా ఉండేవిధంగా ముందస్తుగానే ఎంచుకునేలా ఈ ఫిల్టర్ ఆప్షన్ పనిచేస్తుందని ద టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. నెటిజన్ల నిత్య జీవితంలో భాగమైపోయిన ఫేస్బుక్ గత మార్చిలో ప్రవేశపెట్టిన 'ఆన్ దిస్ డే' ఫీచర్ ఎంతగానో పాపులార్ అయింది. ప్రస్తుత రోజుకు సంబంధించిన గత సంవత్సరాల్లో పోస్టు చేసిన ఫొటోలు, స్టెటస్లు, వీడియోలు, స్నేహితులతో ముచ్చట్లు ఇది గుర్తుచేస్తుండటంతో యూజర్లకు ఆ మధురానుభూతులు మళ్లీ తిరిగొచ్చిన భావన కలుగుతుంది.
అయితే ఇది ఫేస్బుక్ హిస్టరీలోని యూజర్ల బాధాతప్తమైన ఘటనలను కూడా మళ్లీ తెరపైకి తెస్తుండటంపై ఈ ఫీచర్ పై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో యూజర్ల భావోద్వేగాలకు అనుగుణంగా ఈ ఫీచర్‌కు మరింత మెరుగులు దిద్దేందుకు నిర్ణయించిన ఫేస్బుక్ తాజాగా ఫిల్టర్ ఆప్షన్ ను తీసుకువస్తున్నది. అలాగే త్వరలోనే రియాక్షన్ ఫీచర్‌ను కూడా తీసుకువస్తున్నట్టు ధ్రువీకరించింది. ఈ ఫీచర్ ద్వారా ప్రేమ, ఆనందం, నవ్వు, షాక్, బాధ, కోపం వంటి అనుభూతులను స్పష్టంగా చాటే స్మైలీలను తీసుకురానుంది.