ఫేస్‌బుక్‌ రూల్స్ మార్పు.. నిఘాకు చెల్లుచీటీ

14 Mar, 2017 18:09 IST|Sakshi
ఫేస్‌బుక్‌ రూల్స్ మార్పు.. నిఘాకు చెల్లుచీటీ

ఫేస్‌బుక్ తన నిబంధనలను కఠినతరం చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఉన్న సమాచారాన్ని సేకరించి, దాని ఆధారంగా నిఘా పెట్టడానికి సంస్థలకు వీలు లేకుండా నిషేధించింది. సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన సమాచారాన్ని చట్ట సంస్థలకు అమ్ముకుంటున్నాయని.. వాటి ద్వారా వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని ఇటీవల గుర్తించారు. ప్రధానంగా కొన్ని దేశాల్లో వర్ణవివక్షతో కూడా ఇలా కొంతమందిని టార్గెట్ చేస్తున్నట్లు తెలిసింది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకునేవాళ్లకు ఈ సోషల్ మీడియా నిఘా అనేది పెనుముప్పుగా పరిణమించింది. కొన్ని చట్ట సంస్థలు కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని వ్యక్తుల మీద కేసులు పెడుతున్నాయని ఏసీఎల్‌యూ తరఫు న్యాయవాది మాట్ కాగిల్ తెలిపారు. అయితే ఇప్పుడు ఇలా ఫేస్‌బుక్ ద్వారా సమాచారాన్ని నిఘా అవసరాల కోసం వాడుకోడాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఆ సంస్థ వివరించింది. అయితే 'నిఘా' అంటే ఏంటన్న విషయాన్ని మాత్రం పూర్తిగా వివరించలేదు.

ఫేస్‌బుక్ పోస్టింగులను మానిటర్ చేసేందుకు కొన్ని రకాల టూల్స్ ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరెవరు ఎలాంటి పోస్టింగులు చేస్తున్నారో పరిశీలించవచ్చు. అమెరికా లాంటి దేశాల్లో నిఘా సంస్థలు ఈ టూల్స్‌ను విస్తృతంగా వాడుతున్నాయి. ఇందుకోసం 2010 నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 40 కోట్లు వెచ్చించాయి. అయితే, తాము పోస్ట్ చేస్తున్న సమాచారమే తమ పీకకు చుట్టుకుంటోందన్న విషయం చాలామందికి తెలియదు. దాంతో ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ఫేస్‌బుక్ తన పాలసీని పూర్తిగా మార్చింది. అందులోఉ సమాచారాన్ని నిఘా అవసరాల కోసం ఉపయోగించకుండా నిబంధనలు విధించింది. తన ప్లాట్‌ఫాంను నిఘా కోసం ఉపయోగించే టూల్స్ తయారుచేసే డెవలపర్లపై తాము ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్‌బుక్ ఒక బ్లాగ్ పోస్టులో తెలిపింది.

మరిన్ని వార్తలు