-

లక్ష కోట్లతో వాట్స్యాప్ను కొనేస్తున్న ఫేస్బుక్

20 Feb, 2014 11:10 IST|Sakshi
లక్ష కోట్లతో వాట్స్యాప్ను కొనేస్తున్న ఫేస్బుక్

ఇప్పటివరకు అంతర్జాతీయ ఇంటర్నెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత బిగ్ డీల్ ఒకటి జరిగింది. మొబైల్స్లో ఇటీవల బాగా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న వాట్స్యాప్ను దాదాపు లక్షా పద్దెనిమిది వేల కోట్లతో ఫేస్బుక్ కొనేస్తోంది. ఈ డీల్ మొత్తం విలువ దాదాపు రూ. 1,18,200 కోట్లు!! ఈ విషయాన్ని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకెర్బెర్గ్ ప్రకటించాడు. ఈ మొత్తంలో కొంత భాగాన్ని ఫేస్బుక్ స్టాక్ గాను, మరికొంత మొత్తాన్ని నగదుగాను చెల్లిస్తున్నట్లు తెలిపాడు.

ఈ ప్రపంచం మరింతగా కనెక్ట్ కావాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే వాట్స్యాప్ను కొంటున్నామని జుకెర్బెర్గ్ చెప్పాడు. జనం తమకు కావల్సింది ఏదైనా ఇందులో షేర్ చేసుకోవచ్చన్నాడు. దీని సాయంతో ప్రపంచం నలుమూలల ఉన్నవాళ్లు ఈ యాప్ను ప్రతిరోజూ ఉపయోగించుకోడానికి వీలుంటుందని వివరించాడు. ఫేస్బుక్ మార్కెట్ విలువలో ఈ డీల్ మొత్తం 9 శాతం మాత్రమే. మొత్తం 1900 కోట్ల డాలర్ల డీల్కు తోడు, వాట్స్యాప్ వ్యవస్థాపకులు, ఉద్యోగులకు మరో 300 కోట్ల డాలర్ల నియంత్రిత స్టాక్ కూడా ఇస్తారు. ఫేస్బుక్లోనే స్వతంత్రంగా వాట్స్యాప్ కూడా ఉంటుందని జుకెర్బెర్గ్ అంటున్నాడు. తమ భాగస్వామ్యం వల్ల బేసిక్ ఇంటర్నెట్ సేవలు ప్రతి ఒక్కరికీ మరింత అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

వాట్స్యాప్ను 2009లో ప్రారంభించారు. అమెరికాకు చెందిన బ్రియాన్ యాక్టన్, ఉక్రెయిన్కు చెందిన జాన్ కౌమ్ దీన్ని స్థాపించారు. అప్పట్లోనే వీళ్లు గూగుల్, ఫేస్బుక్ వద్దకు వెళ్లి అడిగినా.. వాళ్లు నిరాకరించారు.

మరిన్ని వార్తలు