న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని నిలబెడదాం

31 Aug, 2015 02:37 IST|Sakshi
న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని నిలబెడదాం

సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థ తలుపుతట్టే కక్షిదారులతో ప్రేమగా మాట్లాడి, వారి సమస్య పరిష్కారం అయ్యే దిశగా మార్గనిర్దేశనం చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలే న్యాయశాఖ ఉద్యోగులకు సూచించారు. ఆదివారం నగరంలో జరిగిన అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల జాతీయ సదస్సుకు జస్టిస్ బొసాలే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయమూర్తులు, ఉద్యోగులు, సిబ్బంది కలిపితే న్యాయవ్యవస్థ అని పేర్కొన్నారు.

అన్ని వ్యవస్థలూ విఫలమైన తర్వాత చిట్టచివరి ఆశగా ప్రజలు న్యాయవ్యవస్థ వద్దకు వస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతే అది అరాచకానికి దారి తీస్తుందని... ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎలాగైనా నిలబెట్టాలని ఉద్యోగులకు సూచించారు.

ప్రతి మనిషి విజయం వెనుక మహిళ ఉంటే...న్యాయమూర్తుల విజయం వెనుక  నిరంతరం కష్టించే ఉద్యోగులు, సిబ్బంది ఉంటారని ప్రశంసించారు. న్యాయమూర్తులు సమర్థవంతంగా తీర్పులు వెలువరించడంతోపాటు కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఎంతోమంది ఉద్యోగులు కోర్టు వేళలు ముగిసిన తర్వాత కూడా పనిచేస్తున్నారని, కేసుల జాబితా రూపొందించడంతోపాటు న్యాయమూర్తులకు కేసు ఫైళ్లను చేరవేస్తున్నారని ప్రశంసించారు.

న్యాయశాఖ ఉద్యోగుల సంక్షేమం కోసం జస్టిస్ జగన్నాథశెట్టి కమిషన్ చేసిన సిఫార్సుల్లో దేశంలోనే మొదటిసారిగా ఉమ్మడి హైకోర్టు చాలావాటిని అమలు చేసిందని తెలిపారు. అమలుకు నోచుకోని మరిన్ని సిఫార్సులను కూడా త్వరలోనే అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చిన తర్వాత సర్టిఫైడ్ కాపీలను ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని... కక్షిదారులకు ఇబ్బంది కలగకుండా ఉద్యోగులు చూసుకోవాలని సూచించారు.

న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, న్యాయమూర్తులతో కలసి ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు సత్వర న్యాయం అందించాలని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి అన్నారు. సహనం, శాంత స్వభావంతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని... న్యాయశాఖ ఉద్యోగులు ఈ రెండు లక్షణాలను అలవర్చుకోవాలని జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు.

ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుతో పోలిస్తే న్యాయశాఖ ఉద్యోగుల పనితీరు భిన్నంగా ఉంటుందని, జస్టిస్ జగన్నాథశెట్టి కమిషన్ సిఫార్సులను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ షకీల్‌అహ్మద్ మోయిన్ అన్నారు. న్యాయవ్యవస్థ సున్నితంగా నడవడం వెనుక ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని, న్యాయమూర్తుల తరహాలోనే ఉద్యోగులు, సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పించాలని సంఘం జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి బోద లక్ష్మారెడ్డి అన్నారు.

తమ సంఘం కృషి ఫలితంగానే అన్ని రాష్ట్రాలు శెట్టి కమిషన్ సిఫార్పులు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. సమావేశంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.రజని, హైకోర్టు రిజిస్ట్రార్ ముత్యాలనాయుడు, ఏపీ, టీఎస్ రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య, గోపీనాథ్‌రెడ్డి, జగన్నాథం, రాజశేఖర్‌రెడ్డి, నేతలు సురేశ్‌శర్మ, సురేశ్ ఠాకూర్, శ్రీధర్‌రావు, సుబ్బయ్య, నల్లారెడ్డి, కృష్ణనాయక్, రాజిరెడ్డి, నరసింహారెడ్డి, సుబ్రమణ్యంలతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
 
ప్రధాన కార్యదర్శిగా లక్ష్మారెడ్డి
అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా బోద లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలో నిర్వహించిన జాతీయ సదస్సులో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ప్రధాన కార్యదర్శిగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1983లో న్యాయశాఖలో చేరిన లక్ష్మారెడ్డి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి శెట్టి కమిషన్ సిఫార్సుల అమలు కోసం కృషి చేశారు.

మరిన్ని వార్తలు