‘ప్లాస్టిక్’ బియ్యం!

30 Nov, 2015 01:08 IST|Sakshi
బాధితుడు కొనుగోలు చేసిన బియ్యం, వండిన తర్వాత ప్లాస్టిక్‌లా సాగిన అన్నం

సూపర్ మార్కెట్ ముందు బాధితుడి ఆందోళన
హైదరాబాద్: బియ్యంలో ప్లాస్టిక్  బియ్యం వచ్చాయంటూ బాధితులు ఆందోళనకు దిగిన సంఘటన ఆదివారం నాగోలులో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం... బండ్లగూడ శివశంకర్‌కాలనీలో నివాసముండే మంగ శ్రీనివాస్ ఓ టీవీ చానల్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1న నాగోలులోని మోర్ సూపర్ మార్కెట్‌లో 25 కిలోల గజానన్ బ్రాండ్ బియ్యాన్ని రూ.950కు కొనుగోలు చేశాడు. ఆదివారం ఇంట్లో ఈ బియ్యంతో అన్నం వండారు.

మధ్యాహ్నం సమయంలో వండిన పాత్రలో అడుగుభాగం గట్టిగా మారి అన్నం ప్లాస్టిక్‌లా సాగింది. దీంతో బాధితులు నాగోలులోని మోర్ సూపర్ మార్కెట్ వద్దకు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా మాకేం సంబంధం లేదంటూ వారు సమాధానమిచ్చారు. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులతో మోర్ మార్కెట్ వద్ద ఆందోళనకు సిద్ధం కాగా, షాపు మేనేజర్ వచ్చి బియ్యాన్ని పరిశీలించారు. కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లా నుంచి గజానన్ బియ్యాన్ని తెప్పించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని స్టోర్లలో విక్రయిస్తున్నామని, ఇంతవరకు ఎలాంటి కంప్లయింటూ రాలేదని మేనేజర్ చెప్పారు.

అందరి ఎదుటా తమ వద్దనున్న సంచుల్లో నుంచి బియ్యం తెచ్చి వండి చూపించారు. అందులో ప్లాస్టిక్ ఆనవాళ్లు కనిపించలేదన్నారు. అయితే తనకు విక్రయించింది మాత్రం ప్లాస్టిక్ బియ్యమేనంటూ బాధితుడు స్పష్టం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు సురేందర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా సివిల్‌సప్లైస్ విభాగం విజిలెన్స్ సభ్యులు జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు మోర్ వద్దకు వచ్చి బియ్యం పరిశీలించారు.

కాగా, నగరంలో చైనా నుంచి సరఫరా అవుతున్న బియ్యంలో ప్లాస్టిక్ ఆనవాళ్లున్నట్లు పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నగర మార్కెట్‌లో చైనా బియ్యం త్వరలో సరఫరా అవుతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా, తామిప్పటి వరకూ వాటిని చూడలేదని హయత్‌నగర్‌లోని రైస్‌మిల్లర్ శంకర్‌రెడ్డి చెప్పారు. ఒకవేళ ప్లాస్టిక్ బియ్యం కలిసిన అన్నం తింటే జీర్ణకోశ వ్యాధులు తప్పవంటూ అపోలో ఆసుపత్రి డీఆర్‌డీఓ డాక్టర్ సమి హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు