రుణ మాఫీ.. ఓ వైఫల్యం

7 Feb, 2014 03:23 IST|Sakshi

న్యూఢిల్లీ: రూ.65 వేల కోట్లతో 2008లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ రుణ మాఫీ పథకం తప్పుల తడకగా సాగిందని పార్లమెంటరీ కమిటీ ఒకటి విమర్శించింది. పథకం అమల్లో చాలా లోపాలున్నాయని, ఈ పథకం ఎందుకు విఫలమైందో ఆర్థిక సర్వీసుల విభాగం కనుక్కోవాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులను కఠినంగా శిక్షించాలని సూచించింది. ఈ మేరకు ప్రజా పద్దుల కమిటీ నివేదిక రూపొందించింది. ‘వ్యవసాయ రుణాల రద్దు, రుణ ఉపశమన పథకం-2008’ లక్ష్యం ప్రశంసించదగినదైనప్పటికీ.. దాన్ని అమలు చేసిన తీరు చాలా చెత్తలా ఉంది.. దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది’ అని పేర్కొంది. నివేదికను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోని కమిటీ ఈ నివేదిక రూపొందించింది.

అందులో ముఖ్యాంశాలివీ..
   -  లబ్ధిదారుల పేర్ల మార్పులు, చేర్పుల్లో తప్పులు, పత్రాలు పూరించడంలో నిర్లక్ష్యం, రికార్డులు తారుమారు చేయడం లాంటి కారణాల వల్ల పథకం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది.
 -    చాలా కేసుల్లో అర్హులైన రైతులకు లబ్ధి చేకూరలేదు. పథకం మార్గదర్శకాలకు విరుద్ధంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రీయింబర్స్ చేశారు.
-     పథకం అమలు పర్యవేక్షణ చాలా అసమర్థంగా ఉంది.
  -   అమలులో చాలా లోపాలున్నాయని గతంలో కాగ్ కూడా తప్పు బట్టింది.
  -   పర్యవేక్షణ బాధ్యతలు చూడాల్సిన ‘డీఎఫ్‌ఎస్’.. 2008లో మార్గదర్శకాలు విడుదల చేశాక పథకం అమలును పట్టించుకోవడం మానేసింది.

>
మరిన్ని వార్తలు