రైతులపై ప్రభుత్వాలది సవతి తల్లి ప్రేమ

14 Oct, 2015 04:45 IST|Sakshi
రైతులపై ప్రభుత్వాలది సవతి తల్లి ప్రేమ

వ్యయానికీ, ఎంఎస్‌పీకీ పొంతన ఉండటం లేదు
అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
♦  హైకోర్టుకు నివేదించిన కోదండరాం, జలపతిరావు
తమనూ ప్రతివాదులుగా చేర్చుకోవాలని పిటిషన్

సాక్షి, హైదరాబాద్:  రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో తమనూ ప్రతివాదులుగా చేర్చుకుని తమ వాదనలూ వినాలంటూ తెలంగాణ విద్యార్థి వేదిక గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, తెలంగాణ రైతు జేఏసీ ప్రతినిధి ఎల్.జలపతిరావు సంయుక్తంగా మంగళవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

రైతుల పట్ల ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపుతున్నాయని, రైతుల పట్ల ఒక రకంగా, పారిశ్రామిక వేత్తల పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నాయని వారు అందులో పేర్కొన్నారు. సాగు వ్యయానికీ, ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కూ ఏ మాత్రం పొంతన ఉండటం లేదని, పెట్టిన ఖర్చులు కూడా దక్కక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మద్దతు ధర లభించక రైతులు విధి లేక తమ పంటను దళారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు.

అసలు ఎంఎస్‌పీ ఖరారు ప్రక్రియనే అశాస్త్రీయంగా ఉంటోందని, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రపంచీకరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ రైతుల కమిషన్ 2006లో చేసిన సిఫారసులను ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. ఎంఎస్‌పీ ఖరారు సమయంలో ఎంఎస్‌పీకి సాగువ్యయాన్ని 50 శాతం అదనంగా చేర్చాలన్న సిఫారసును పట్టించుకునే నాథుడు లేరని వివరించారు.

రైతులకు నిర్ధిష్టంగా వార్షిక ఆదాయం అంటూ ఉండదని, వార్షికాదాయం పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని కోదండరాం, జలపతిరావు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒకవైపు పెరిగిన ఖర్చులు, మరోవైపు అధిక వడ్డీలకు తెచ్చిన రుణాల మధ్య రైతులు నలిగిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారన్నారు. పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించే ప్రభుత్వాలు, రైతులకు మాత్రం కోతలను అమలు చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాల నుంచి మద్దతు లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు, అధిక వడ్డీలు ఇలా అనేక అంశాలు అన్నదాతను ఊపిరి సలపకుండా చేస్తున్నాయన్నారు.

ఆర్థిక సంస్థలు సైతం హైటెక్ వ్యవసాయ వ్యాపారులకు, బయోటెక్నాలజీ కంపెనీలకు ఇస్తున్న స్థాయిలో రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. 1986-1990ల్లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు 14.5 శాతం ఉంటే ఇప్పుడది 6 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల అమలుతో సాగు భూముల వృద్ధి రేటు 2.62 శాతం నుంచి 0.5 శాతానికి పడిపోయిందని వారు వివరించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపించనున్నారు.

మరిన్ని వార్తలు