‘అన్నదాత ఆర్తనాదం’ విన్పించదా?

15 Sep, 2015 00:35 IST|Sakshi
‘అన్నదాత ఆర్తనాదం’ విన్పించదా?

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం, రైతులపై ప్రభుత్వం చిన్నచూపు వల్లనే అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. అన్నదాత ఆర్తనాదం (తెలంగాణ వచ్చినా.. రైతులకు ఎండమావేనా) అనే పుస్తకాన్ని కిసాన్ ఖేత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వకపోగా, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను కనీసం పరామర్శించడం లేదని విమర్శించారు.

ఆత్మహత్యలపై అసత్య ప్రచారంతో రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మంత్రులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రావిర్భావంత ర్వాత 409 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టుగా ప్రభుత్వం లెక్కలు చెబుతున్నదని, వారిలోని నలుగురి కుటుంబాలనైనా పాలకులు పరామర్శించారా? అని ప్రశ్నించారు. రుణమాఫీపై స్పష్టత ఉండాలని, బ్యాంకుల  నుంచి రైతులకు ఒకేసారి రుణాన్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయం సంక్షోభం, రైతుల సమస్యలు, పరిష్కారాలపై అవగాహన కల్పించడానికి టీపీసీసీ మరింత శ్రమించాలని సూచించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. వ్యవసాయం సంక్షోభాన్ని అధిగమించడానికి, రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చేలా అసెంబ్లీలో వ్యవహరిస్తామన్నారు. సమావేశంలో వివిధ జిల్లాల కిసాన్‌సెల్ అధ్యక్షులు, నేతలు పాల్గొన్నారు.
 
హిందీ భాషాభివృద్ధికి కృషి
దేశంలో ఎక్కువమంది మాట్లాడుతున్న హిందీ భాషను అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని ఉత్తమ్ చెప్పారు. హిందీ భాషాదినోత్సవాన్ని గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి టీపీసీసీ లింగ్విస్టిక్ మైనారిటీ సెల్ చైర్‌పర్సన్ ప్రేమలతా అగర్వాల్ అధ్యక్షత వహించగా ప్రేమ్‌లాల్, సంతోష్‌సింగ్ పాల్గొన్నారు. హిందీ భాషాభివృద్ధికి కృషిచేసిన వారిని ఈ సందర్భంగా సన్మానించారు.
 
నేడు సీఎల్పీ సమావేశం
ఈ నెల 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం మంగళవారం సమావేశం కా నుంది. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎల్పీనేత కె. జానారెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రైతు ఆత్మహత్యలపై సమరం చేయాలని సీఎల్పీ యోచిస్తోంది.

రైతుల ఆత్మహత్యలు, కరువు, కరువు మండలాల ప్రకటనలో జాప్యం, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానంలో నిర్లక్ష్యం వంటివాటిపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఎత్తుగడలు, పార్టీ సీనియర్ల మధ్య సమన్వయం వంటివాటిపై సమావేశంలో చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు