ఆగని అన్నదాతల ఆత్మహత్యలు

7 Aug, 2015 02:36 IST|Sakshi
ఆగని అన్నదాతల ఆత్మహత్యలు

వేర్వేరు చోట్ల ఐదుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి, నెట్‌వర్క్: ఎండనకా, వాననక ఆరుగాలం శ్రమించిన అన్నదాతలు కాలం కలిసిరాకపోవడంతో విలవిల్లాడుతున్నారు. అయితే ఖరీఫ్, లేదంటే రబీ, ఇలా ఎప్పటికప్పుడు ఆశతో ఎన్ని పంటలు సాగు చేసినా.. వర్షాభావంతో దెబ్బతింటుండటంతో చివరకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక అప్పులు మిగిలే దుస్థితి ఏర్పడుతోంది. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న మనోవేదనతో రైతులు ఉసురు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో గురువారం మెదక్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐదుగురు రైతులు  అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా మక్తభూపతిపూర్‌కు చెందిన రైతు రాజెల్లిపేట సత్యనారాయణ(35)కు గ్రామ శివారులో రెండెకరాల వ్యవసాయభూమి ఉంది.
 
 అందులో బోరుబావిని తవ్వి వ్యవసాయం చేస్తున్నాడు. కాలం కలిసిరాకపోవడంతో అప్పులు చేసి రెండేళ్లక్రితం సత్యనారాయణ దుబాయికి వలసవెళ్లాడు. అక్కడ విదేశీ వలసదారులపై నిషేధం విధించటంతో సంవత్సరం క్రితం తిరిగి స్వదేశానికి వచ్చాడు. అటు అప్పులు తీరే మార్గంలేక.. ఇటు పంటలు పండే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.  గురువారం తెల్లవారుజామున  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామానికి చెందిన రైతు అల్లూరి ప్రతాపరెడ్డి(45)  తనకున్న ఎకరంన్నర భూమిలో మామిడితోటతోపాటు పొలం సాగు చేస్తున్నాడు. కరువు నేపథ్యంలో చేసిన అప్పులు రూ.3 లక్షలకు చేరాయి. దీంతో పురుగులమందు తాగాడు.
 
 వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని ద్వారకపేట గ్రామానికి చెందిన రైతు తిప్పిరెడ్డి రాజిరెడ్డి(40) తన మూడు ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసి రూ.2 లక్షలు అప్పులు చేశాడు. వర్షాభావంతో పంటలు పండే అవకాశం లేదని,  తెచ్చిన అప్పు తీర్చలేమనే బెంగతో బుధవారం సాయంత్రం పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం మృతి చెందాడు.  వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరుకు చెందిన మహిళా కౌలు రైతు నంగి ఓజయ్య భార్య నంగి ఎల్లవ్వ(50) తనకున్న ఎకరంతోపాటు మరో ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తిపంట వేసింది. పెట్టుబడులు, ఇతర ఖర్చులకు రూ.2 లక్షల అప్పులయ్యూరుు. వర్షాభావంతో పంట దెబ్బతినడంతో.. అప్పులు తీర్చలేమని మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరివేసుకుంది.  మహబూబ్‌నగర్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డిపల్లికి చెందిన రైతు బాషమోని బాలస్వామి (35) అప్పులబాధతో గురువారం ఒంటికి నిప్పం టించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

>
మరిన్ని వార్తలు