ఓ ముసుగు ముచ్చట

7 Feb, 2016 10:13 IST|Sakshi
ఓ ముసుగు ముచ్చట

Protection 4 Fashion 8
స్కార్ఫ్.. ఒక రక్షణ కవచం. కాలుష్య రక్కసి నుంచి మాత్రమే కాదు కాటేసే చూపుల నుంచి కూడా. పొల్యూషన్‌కు సొల్యూషన్‌లా వచ్చిన ఈ స్కార్ఫ్ ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా మారుతోంది. దీంతో అమ్మాయిలు వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. వీటి ట్రెండ్ ఊపందుకోవడంతో కొత్త కొత్త వెరైటీ స్కార్ఫ్‌లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఫ్యాషన్ మోజులో ఏవి పడితే అవి ఉపయోగించడం వల్ల చర్మవ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు సిటీకి చెందిన డెర్మటాలజిస్టులు.
- ఎస్.సత్యబాబు
 
నిజానికి స్కార్ఫ్‌లను స్టోల్ అని పిలుస్తారు. అయితే వాడుకలో స్కార్ఫ్ అంటున్నారు. సిటీలో కాలుష్యం బారి నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు స్కార్ఫ్‌లను విరివిగా వినియోగిస్తున్నారు. బైక్, బస్సుల్లో, ఆఖరికి నడిచి వెళ్తున్నవారు కూడా విభిన్న రకాల స్కార్ఫ్‌లను వాడుతున్నారు. ప్రొటక్షన్‌గా వచ్చిన స్కార్ఫ్‌లు  కాస్త ఫ్యాషన్‌గా మారిపోయాయి. అయితే స్కార్ఫ్‌ల ఫ్యాబ్రిక్ వల్ల కొత్త రకం చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదముందని సిటీకి చెందిన ప్రజ్ఞ ఆసుపత్రి డాక్టర్ పద్మావతి సూరపనేని హెచ్చరిస్తున్నారు. రక్షణ కోసం వాడేది సమస్యల కారకంగా మారకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటున్నారు.
 
వస్త్రం నుంచి వర్ణం దాకా కారణాలే..
దేహంతో పోలిస్తే  మహిళల ముఖ చర్మం మరింత సున్నితం. కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకునేందుకు స్కార్ఫ్‌లు వినియోగించినప్పటికీ తరచూ ముఖంపై రాషెస్ వస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారంటే కారణం... సదరు స్కార్ఫ్‌ల తయారీలో వినియోగించిన కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి ఫ్యాబ్రిక్ అలర్జీ కారణంగా రాషెస్ రావచ్చు.

ముఖ్యంగా నైలాన్, పాలిస్టర్, స్పాండెక్స్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌లు వినియోగిస్తే కాంటాక్ట్ డెర్మటైటిస్ (ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే చర్మవ్యాధి) సమస్య తప్పదు. అదే విధంగా కొన్ని ఫ్యాబ్రిక్స్ మెత్తగా, ముడతల్లేకుండా ఉండేందుకు వాడే ఐడొహైడ్ వంటి రసాయనాలు సైతం చర్మంపై దుష్ర్పభావాన్ని చూపిస్తాయి. అలాగే కొన్ని రకాల రంగుల్లో వినియోగించే పారా-ఫెనిలెనెడియామైన్(పిపిడి) అజో, ఆంత్రాక్క్వైనోన్ ఆధారిత డైలు కూడా అలర్జిక్ డెర్మటైటిస్‌కు కారణమవుతాయి. కాటన్, ఫ్యాబ్రిక్, ప్యూర్ సిల్క్ వంటి వాటిలో కూడా వీటిని వినియోగిస్తారు.  
 
మేకప్పుకు పైకప్పుగా వద్దు..
కన్సీలర్స్ లేదా ఫౌండేషన్‌ను ముఖానికి వినియోగించినప్పుడు అదే సమయంలో సింథటిక్ స్కార్ఫ్స్‌ను ఎక్కువ సేపు అదిమిపెట్టి ఉంచితే గాలి సోకకపోవడంతో విపరీతమైన స్వేదం ఏర్పడి మొటిమలు వస్తాయి. స్కార్ఫ్స్ కొనేటప్పుడు సహజ సిద్ధంగా తయారైన ఫ్యాబ్రిక్ లేదా కాటన్ లేదా లెనిన్ ఫ్యాబ్రిక్‌మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం. రంగులు కూడా అత్యంత తక్కువ కలిసినవి మాత్రమే వినియోగించాలి. వీటిలో తక్కువ డై ఉంటుంది. ఎక్కువ సేపు స్కార్ఫ్ కట్టుకొని ఉండాల్సి వస్తే దానిని తొలగించిన వెంటనే ముఖాన్ని మంచినీటితో శుభ్రపరచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.  
 
డాక్టర్ పద్మావతి డెర్మటాలజిస్ట్, కాస్మొటాలజిస్ట్, ప్రజ్ఞ హాస్పిటల్,పంజాగుట్ట
040 23356070 / 9848367000

మరిన్ని వార్తలు