విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు పచ్చజెండా

6 Nov, 2015 03:05 IST|Sakshi
విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు పచ్చజెండా

3,030 ఎకరాల అభయారణ్యం బదలాయింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా చింతపల్లి, జెర్రెల అభయారణ్యాల్లో బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపింది. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ చింతపల్లి, జెర్రెల బ్లాకుల్లోని 3,030 ఎకరాల (1,212 హెక్టార్ల) అభయారణ్యాన్ని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి బదలాయిస్తూ అక్కడి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ బాక్సైట్ తవ్వకాలు జరపడానికి వీలులేదని, మైనింగ్ లీజులు రద్దు చేయాలంటూ గిరిజనులు ఉద్యమాలు జరుపుతున్న సమయంలో ప్రభుత్వం తుదిదశ పర్యావరణ అనుమతులు (స్టేజ్-2 క్లియరెన్స్) జారీ చేయడంతోపాటు అభయారణ్యాన్ని ఏపీఎండీసీకి బదలాయిస్తూ జీవో నంబరు 97 జారీ చేయడం గమనార్హం.

మైనింగ్ లీజులున్న ప్రాంతాన్ని ఏపీఎండీసీకి బదలాయించేందుకు కేంద్ర అటవీ పర్యావరణశాఖ ఆగస్టు 17న అనుమతించిందని, దీనికనుగుణంగానే జీవో జారీ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీఎండీసీకి అటవీ భూమిని బదలాయించడమంటే ఖనిజ తవ్వకాలకు అనుమతించడమేనని స్పష్టమవుతోంది.
 
బాబు రెండు నాల్కల ధోరణి
ఏపీఎండీసీకి ఈ మైనింగ్ లీజులు ఇవ్వడాన్ని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా తీవ్రంగా తప్పుబట్టారు. ఇక్కడ ఖనిజ తవ్వకాలు జరుగనీయబోమని, గిరిజనులకు అండగా ఉంటూ లీజులు రద్దయ్యేవరకు పోరాటం సాగిస్తామని ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. బాక్సైట్ మైనింగ్ లీజులను రద్దు చేయాలంటూ అప్పట్లో గవర్నరుకు వినతిపత్రం కూడా సమర్పించారు. అదే చంద్రబాబు సీఎం కాగానే స్వరం మార్చారు.

బాక్సైట్ తవ్వకాల ద్వారానే గిరిజనుల ప్రగతి సాధ్యమవుతందని ప్రకటించారు. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని సహించేది లేదంటూ హెచ్చరికలు జారీచేశారు. వ్యక్తిగత స్వార్థంతో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఒకవిధంగా, అధికారంలో ఉండగా మరోరకంగా వ్యవహరిస్తారనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రతిపక్షంలో ఉండగా ఇక్కడ బాక్సైట్ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోను సమ్మతించేది లేదంటూ ఉద్యమం చేస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే స్వయంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చి బాక్సైట్ తవ్వకాలకు వీలుగా తుదిదశ అటవీ క్లియరెన్స్, అభయారణ్యం బదలాయింపునకు ఉత్తర్వులు తెప్పించారు.

వీటి ఆధారంగా విశాఖ జిల్లాలోని చింతపల్లి, జెర్రెల అభయారణ్యంలో 3,030 ఎకరాలను ఏపీఎండీసీకి బదలాయిస్తూ రాష్ట్ర అటవీ పర్యావరణశాఖ గురువారం జీవో జారీచేసింది. దీంతో చంద్రబాబు తీరుపై జిల్లాలోని గిరిజనులు, రాజకీయ పక్షాల ప్రతినిధులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు