క్షుద్రపూజల పేరిట కన్నకూతురు బలి

8 Sep, 2015 03:00 IST|Sakshi

కాన్పూర్: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే తన పసిబిడ్డను క్షుద్రపూజల పేరిట బలి ఇచ్చిన సంఘటన ఉత్తరప్రదేశలో చోటు చేసుకుంది. కాన్పూర్ జిల్లా జాగురా గ్రామంలో గిరిజేశ్ పాల్ (40) అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిజేశ్‌కు భార్య సునీత, అంకిత్(15), అమన్(12) అనే కుమారులతోపాటు తొమ్మిదేళ్ల కుషి అనే కూతురు ఉంది. ఈ దారుణం జరిగిన శనివారం సునీత, ఇద్దరు కుమారులతో పొరుగూరులోని బంధువుల వద్దకు వెళ్లింది.

ఆ రోజు రాత్రి గిరిజేశ్ క్షుద్రపూజలు చేసి చిన్నారి కుషిని బలిచ్చాడు.  భార్యా, కుమారులు రాత్రి తిరిగి వచ్చాక గిరిజేశ్ ఎంతకూ తన గది తలుపులు తెరవకపోవడంతో వారు తలుపు కన్నంలోంచి గదిలోకి చూడగా కుషి దేహం రక్తపు మడుగులో కనిపించింది. ఇరుగుపొరుగువారు  తలుపులు బద్దలుకొట్టి గదిలోకి వెళ్లినప్పుడు గిరిజేశ్.. కుషి మృతదేహం చుట్టూ నృత్యం చేస్తూ కనిపించాడు. అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు