జీఎస్టీ వద్దంటూ అప్పుడే లాబీయింగ్

12 Aug, 2016 13:37 IST|Sakshi
జీఎస్టీ వద్దంటూ అప్పుడే లాబీయింగ్

పార్లమెంట్ ఇటీవలే ఆమోదించిన ప్రతిష్ఠాత్మకమైన బిల్లు జీఎస్టీపై భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ పన్ను మినహాయింపును ఎంజాయ్ చేసిన కొన్ని రంగాలు జీఎస్టీ రాకతో తమపై పడే భారాన్ని లెక్కలేసుకుంటున్నాయి. ఈ పన్ను నుంచి తమను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అప్పుడే లాబీయింగ్ కూడా మొదలు పెట్టేశాయట. ఈ లాబీయింగ్లో ఎక్కువగా పరికరాలను దిగుమతి చేసుకునే పునరుత్పాదక ఇంధన రంగం ముందంజలో ఉంది. ఇప్పటివరకు జీరో కస్టమ్ డ్యూటీని ఎంజాయ్ చేసిన సౌర విద్యుత్ పరికరాల సంస్థలు.. జీఎస్టీ రాకతో దిగుమతిచేసుకోబోయే సోలార్ ప్యానళ్లపై 18 శాతం పన్నులను భరించాల్సి ఉంటుంది. దీంతో సౌర విద్యుత్ ధర కూడా యూనిట్‌కు రూపాయి వరకు పెరగనున్నట్టు రీన్యూ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రవి సేత్ తెలిపారు.

పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదనను ఉంచినట్టు తెలిపారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుచేశాక దీనిపై ఆ కౌన్సిలే నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారని హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సీఈవో సునీల్ జైన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ రంగానికి వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల నుంచి మినహాయింపు ఉంది. జీఎస్టీ రాకతో పన్నులన్నింటిలో మార్పులు సంభవించి, టారిఫ్ కనీసం 10 శాతం ఎగిసే అవకాశాలున్నట్టు ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా టెలికాం రంగం సైతం జీఎస్టీ నుంచి తమను మినహాయించాలని ప్రభుత్వాన్ని కాకా పడుతోందట. జీఎస్టీ విధింపుతో వినియోగదారులు చార్జీల భారం భరించాల్సి ఉన్నట్టు ఆ రంగం నిపుణులు చెబుతున్నారు.

జీఎస్టీ విధింపుతో పెట్రో ఉత్పత్తులు, విద్యుత్ చార్జీలు పెరిగి.. వీటిని బాగా వాడుకునే టెలికాం టవర్లపై ప్రభావం చూపగలవని అంచనా వేస్తున్నారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ తప్పనిసరిగా తమ భయాందోళనలు అర్థంచేసుకుని నిర్ణయం ప్రకటిస్తుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగం సైతం జీఎస్టీ నుంచి మినహాయింపును డిమాండ్ను చేస్తోంది. ఎయిర్ లైన్ సెక్టార్లో 5.6 శాతం నుంచి 9 శాతంగా ఉన్న సర్వీసు టాక్స్ రేంజ్ జీఎస్టీ రాకతో మరింత పెరగనుంది.

మరిన్ని వార్తలు