ఫెడ్‌ వడ్డీ రేట్లు యథాతథం

4 May, 2017 09:11 IST|Sakshi

వాషింగ్టన్‌: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ తన ఫెడ్‌ ఫండ్‌ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.75 - 0.1 శాతం శ్రేణిలో ఉంది. జానెట్‌ యెలెన్‌ నేతృత్వంలోని ఫెడ్‌, ప్రస్తుతానికి రేటు పెంపు నిర్ణయాన్ని పక్కనబెట్టాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.  అయితే క్రమేపీ రేట్లు పెంచే ప్రక్రియను కొనసాగిస్తామని తాజాగా ఫెడ్‌  ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో ఉపాధి కల్పన పటిష్టంగా వుందని, ఆర్థికాభివృద్ధి ఓ మోస్తరుగా వుండవచ్చని ఫెడ్‌ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికమేనని కూడా ఫెడ్‌  తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్‌లో రేట్ల పెంపు నిర్ణయం ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

తాజా విధాన సమావేశం తర్వాత ఫెడ్ బుధవారం విడుదల చేసిన ఫెడ్‌  జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ గణనీయంగా మందగించింది కానీ నిశ్చలంగాఉండనున్నట్టు భావించింది. డిసెంబరు, మార్చ్ నెలల్లో స్వల్పకాలిక రేటును స్వల్పంగా పెంచిన  అనంతరం యథాతథవైఖరి అనుసరిస్తోంది. అయితే  తదుపరి జూన్  రివ్యూలో మళ్లీ స్వల్పంగా వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని  చాలామంది ఆర్థికవేత్తలు  భావిస్తున్నారు.  మహా మాంద్యం ముగిసిన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత, నిరుద్యోగ రేటు తక్కువగా 4.5 శాతంగా ఉంది. అయితే ఇప్పటికీ వినియోగ వ్యయం,  ఫ్యాక్టరీ ఉత్పత్తి మందగించడంతోపాటు  ద్రవ్యోల్బణం ఫెడ్  టార్గెట్‌  రేటు కంటే తక్కువగానే ఉంది.
కాగా రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాలు బుధవారం ముగిశాయి. అమెరికా, ప్రపంచ ఆర్థిక అంశాలు, పరిణామాలను చర్చించిన మార్చి నెల సమావేశంలో ఫెడ్‌ ఫండ్‌ రేటు  పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు